వాషింగ్టన్: ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వేగాన్ని తగ్గించలేకపోతోంది. ఇతర సంస్థలన్నీ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా అమెజాన్ సంస్థ అధినేతగా జెఫ్ బెజోస్ సంపద మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. 

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ జెఫ్ బెజోస్ నికర సంపద 25 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించింది. బ్లూమ్‌బర్గ్ సంస్థ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. జెఫ్ బెజోస్ మొత్తం సంపద విలువ 140 బిలియన్ డాలర్లు. 

జెఫ్ బెజోస్ సంపద.. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ సంపద కంటే రెండు రెట్లు ఎక్కువ. మార్క్ జుకర్ బర్గ్ సంపద 70 బిలియన్ల డాలర్లు మాత్రమే.

లాక్ డౌన్‌ల వల్ల ప్రపంచ వ్యాప్తంతా హోమ్ డెలివరీకి పెరుగుతున్న డిమాండ్ వల్ల అమెజాన్ విలువ అంతకంతకు పెరుగుతోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెజాన్ సేవలను వినియోగిస్తున్న కస్టమర్లు సంఖ్య హాలీడే సీజన్‌ కంటే ఎక్కువగా ఉందని వారు అంటున్నారు. 

కరోనా మహమ్మారి ప్రభావంతో సంపద పెరుగుతున్న కుబేరుల్లో జెఫ్ బెజోస్‌తోపాటు ఎలన్ మస్క్, జూమ్ యాప్ సంస్థ అధినేత ఎరిక్ యువాన్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి జెఫ్ బెజోస్ సంపద 25 బిలియన్ల డాలర్లు పెరిగింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్స్ గేట్స్ సంపద కంటే 35 బిలియన్ల డాలర్లు తక్కువ.

బ్లూమ్ బర్గ్ టాప్-100 బిలియనీర్ల జాబితాలో ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్ స్థానం ఐదవది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జుకర్ బర్గ్ సంపద 8.4 బిలియన్ల డాలర్లు తగ్గుముఖం పట్టింది. 

మూడో స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ప్యామిలీ సంపద గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 15.5 బిలియన్ల డాలర్లు పెరిగి 92 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. వారెన్ బఫెట్ సంపద 83 బిలియన్ల నుంచి 73 బిలియన్లకు, లార్రీ ఎల్లిసన్ వెల్త్ 3.4 బిలియన్ల డాలర్లు పెరిగి 66 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది.

ఇక మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్లీవ్ బల్మార్ సంపద 21.3 బిలియన్ల డాలర్లు పెరిగి 63 బిలియన్ల డాలర్లకు చేరువైంది. జాబితాలో కొత్తగా బిలియనీర్లుగా చేరిన వారిలో జూమ్ అధినేత ఎరిక్ యువాన్, మార్క్ ఆంతోనీ బ్రాండ్స్ చీఫ్ ఆంథోనీ వోన్ మండీ తదితర పది మంది చేరారు.