లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు ఖాయం...భారత్ జీడీపీ 1.6%ఓన్లీ..

కరోనా వైరస్ మహమ్మారితో విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గురవుతుందని కేపీఎంజీ గ్రూప్ అధ్యయనంలో తేలింది. మరోవైపు అమెరికా బ్రోకరేజీ సంస్థ గోల్డ్ మాన్ శాక్స్ మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 1.6 శాతానికి పరిమితం అని పేర్కొంది. రేటింగ్ సంస్థల అంచనాల్లో ఇదే అత్యంత కనిష్టం.

India's growth may slip below 3% in FY21 if COVID-19 proliferates: KPMG

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్రం విధించిన లాక్ డౌన్ వల్ల గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం చివరి దశలో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు ఖాయంగా కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికంలో మనదేశ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. 

కష్టకాలంలో ఇబ్బందులను ఎదుర్కోవడం సవాలే
ఈ కష్టకాలంలో ఇబ్బందులను తట్టుకుని, మెరుగైన వ్యాపారాన్ని నమోదు చేయడం దేశీయ కంపెనీలకు అంత త్వరగా సాధ్యమయ్యే పనికాదు. కొన్ని కంపెనీలు ఫర్వాలేదనుకున్నా, ఎక్కువ సంస్థలు ఇబ్బందుల్లో చిక్కుకుపోయే అవకాశం ఉంది. 

పలు వ్యాపార రంగాలు కుంగిపోయే అవకాశం
ఎన్నో వ్యాపార రంగాలు కుంగిపోయే పరిస్థితి ఉన్నట్లు అగ్రశ్రేణి ఆర్థిక సేవల సంస్థ కేపీఎంజీ అంచనా వేసింది. ఈ నెలాఖరు నాటికి గానీ, వచ్చే నెలలో గానీ కరోనా అదుపులోకి వస్తే..చైనా ఉత్పత్తి రంగంలో కార్యకలాపాలు మొదలవుతున్నాయి.

తక్షణం కోలుకుంటే ద్వితీయార్థంలో ప్రగతిలో మెరుగుదల
ఇతర దేశాల్లోనూ ఈ వ్యాధి అదుపులోకి వచ్చే పక్షంలో 2020-21 ద్వితీయార్థంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశాలు ఉన్నాయని కేపీఎంజీ తెలిపింది. అప్పుడు మనదేశ వృద్ధి రేటు 5.3-5.7 శాతంగా నమోదు కావచ్చు. దీనికి సానుకూల అవకాశం కనిపించడం లేదు.

మనదేశంలో అదుపులోకి వస్తే ప్రయోజనాలు పరిమితం
మనదేశంలో మాత్రమే కోవిడ్‌-19 అదుపులోకి వస్తే.. ప్రపంచంలో అధిక దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడతాయి కాబట్టి పెద్దగా ఉపయోగం ఉండదు. కాకపోతే మనదేశ వృద్ధి రేటు కొంత ఆశాజనకంగా ఉండొచ్చు. జీడీపీ 4 - 4.5 శాతం వృద్ధి సాధించే వీలుందని కేపీఎంజీ పేర్కొంది.

లాక్ డౌన్ కొనసాగిస్తే జీడీపీ క్షీణిస్తుంది
దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగించాల్సి వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటే మనదేశం కూడా ఆర్థికంగా బాగా నష్టపోయి, వృద్ధి రేటు క్షీణిస్తుందని కేపీఎంజీ వ్యాఖ్యానించింది. మన వృద్ధిరేటు మూడు శాతానికంటే దిగువకు పడిపోతుంది

అస్తవ్యస్థం అసంఘటిత రంగ కార్మికుల జీవనం
ఇదిలా ఉంటే దేశంలోని పట్టణాలు, నగరాల్లో జీతభత్యాల మీద ఆధారపడిన వారిలో 37 శాతం మంది అసంఘటిత రంగ కార్మికుల జీవనం అస్తవ్యస్థంగా మారుతుంది. లాక్ డౌన్ వల్ల పని లేక ఇప్పటికే లక్షల మంది తమ ఊళ్లకు తరలివెళ్లారు. రాజస్థాన్‌, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య అధికంగా ఉంది. వీరికి ఆదాయం సక్రమంగా, సకాలంలో అందకపోవచ్చునని కేపీఎంజీ వెల్లడించింది. 

also read 

ముడిభాగాల సరఫరాపైనే అంతా కేంద్రీకరణ
మనదేశం ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్ ఉపకరణాలు- యంత్రాలు, ఆర్గానిక్‌ రసాయనాలు, ప్లాస్టిక్‌ వస్తువులు, ఎరువుల ఉత్పత్తి కోసం ముడి పదార్థాలను భారీగా దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి స్తంభించి, దిగుమతుల మీద ఆధారపడిన వ్యాపార విభాగాల్లోని సంస్థలు ఇబ్బంది పడతాయి.

తగ్గిన ముడి చమురు గిరాకీ
ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశం మనది. ప్రస్తుతం ముడి చమురు ధర గణనీయంగా తగ్గినా, దానివల్ల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందుకోలేకపోతున్నాం. పెట్రోలియం ఉత్పత్తులకు దేశీయంగా గిరాకీ తగ్గడమే ఇందుకు కారణం.

నిధుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఈ పరిస్థితుల్లో నిధుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కేపీఎంజీ వ్యాఖ్యానించింది. భౌతిక దూరం పాటిస్తూనే, సమాజంలో అణగారిన వర్గాల ప్రయోజనాలు కాపాడాల్సి ఉంటుంది. వైద్య సేవలను యుద్ధ ప్రాతిపదికన విస్తరించాలని, ఉత్పత్తి, సరకు రవాణా ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆ నివేదిక సారాంశం. 

లాక్ డౌన్ వల్ల నిత్యావసర వస్తువుల కొనుగోళ్లపైనా ప్రభావమే
వినియోగమే మనదేశంలో ఆర్థిక అభివృద్ధికి ముఖ్యం. జనాభా ఎక్కువ కాబట్టి అధిక వినియోగం, తద్వారా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి జరుగుతుంది. లాక్‌డౌన్‌ వల్ల నిత్యావసరాల వినియోగం పెద్దగా తగ్గకపోయినా, వాయిదా వేయగల వినియోగం పూర్తిగా క్షీణిస్తుందని కేపీఎంజీ హెచ్చరించింది.

ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం
కొన్ని రకాల సేవలకు అసలు గిరాకీ ఉండదు. కరోనా అదుపులోకి వచ్చాకా, కొంతకాలం పాటు ప్రజల ఆలోచనలు- అలవాట్లలో మార్పు ఉంటుంది. తప్పనిసరైతేనే ఖర్చు చేసే పరిస్థితులు వచ్చి, పరోక్షంగా ఆర్థికాభివృద్ధి మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని కేపీఎంజీ స్పష్టం చేసింది. 

దేశీయ వృద్ధి 1.6 శాతమే తేల్చేసిన గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ 
కరోనా వ్యాపించడంతో తలెత్తిన పరిస్థితులు, దాని నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వృద్ధి కొన్ని దశాబ్దాల కనిష్ఠమైన 1.6 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనా వేసింది. ప్రస్తుత సంక్షోభంలో విధాన నిర్ణేతలు ఇప్పటివరకు దూకుడుగా స్పందించలేదని, రాబోయే కాలంలో వారు మరింతగా తమ ప్రయత్నాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

కరోనా వల్ల పరిస్థితి మరింత విషమించొచ్చునని వ్యాఖ్య
ఒకవేళ కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభించకపోయినా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 5 శాతమే నమోదు కావొచ్చని సంస్థ గతంలో అంచనా వేసింది. ఇప్పుడు వైరస్‌ ప్రభావంతో వృద్ధిరేటు మరింత దిగజారొచ్చని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ పేర్కొంది. ఇప్పటివరకు చాలా బ్రోకరేజీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును గణనీయంగా తగ్గిస్తూ అంచనాలు వెలువరించాయి. 

గత నెలలో 3.3%గా దేశీయ జీడీపీ అని గోల్డ్ మాన్ శాక్స్
కాగా, గత నెల 22న ఇదే గోల్ మాన్ సాక్స్ దేశీయ జీడీపీ 3.3 శాతం  వృద్ధి చెందుతుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. 1970, 1980, 2009ల్లో ఆర్థిక మాంద్యం వల్ల నమోదైన వృద్ధి స్థాయిలకు మళ్లీ పరిస్థితులు దిగజారుతున్నాయని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ అభిప్రాయపడింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios