కరోనా ఎఫెక్ట్: హిందూస్థాన్ యూనీ లీవర్ రికార్డు...హర్లిక్స్ బ్రాండ్ కొనుగోలు...
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో దేశీయ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ సంస్థ హిందూస్థాన్ యూనీ లీవర్ తొలిసారి రికార్డు నెలకొల్పింది. స్టాక్ మార్కెట్లో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ. 5 లక్షల కోట్లు దాటింది. హర్లిక్స్ బ్రాండ్ కొనుగోలు నిర్ణయం దీనికి దోహదం చేసింది. ఇప్పటి వరకు రిలయన్స్, టీసీఎస్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. తర్వాతీ స్థానంలోకి హిందూస్థాన్ యూనీ లివర్ వచ్చి చేరింది.
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి విధ్వంసాల్లో రికార్డులు నెలకొల్పినట్లే ప్రగతిలోనూ రికార్డులు నమోదు చేస్తున్నది. తాజాగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) దిగ్గజం హిందూస్థాన్ యూనిలీవర్ మంగళవారం దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది.
టాప్ 3 బ్లూ చిప్ కంపెనీగా నిలిచింది. హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ .5 లక్షల కోట్లను అధిగమించింది.ఈ వరుసలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత మూడవ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా హిందూస్థాన్ యూనీ లివర్ అవతరించింది.
గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ప్రకటించిన మెగా ఒప్పందం ప్రకారం దాదాపు 15 నెలల తర్వాత యూనీ లీవర్‌లో మంగళవారం విలీనమైంది. దీంతో భారత్‌లో అతిపెద్ద ఆహార సంస్థగా హెచ్‌యూఎల్ అవతరించింది. రూ.3,045 కోట్ల విలువైన హార్లిక్స్ బ్రాండ్‌ను కొనుగోలు చేయడానికి బోర్డు అనుమతి లభించందని సంస్థ ప్రకటించింది.
also read ఉద్యోగులుకు కార్పొరేట్ల భరోసా...అండగా నిలుస్తామని సంస్థల హామీ
దీంతో హిందూస్థాన్ యూనిలీవర్ షేర్ ధర 11.41 శాతం పెరిగి రూ .2,399 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది.కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుండి ఎఫ్‌ఎంసీజీ ఫార్మా షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొన్నాయి. ఇవి వరుసగా 10.4 శాతం, 20 శాతం ఎగిశాయి.
ఈ సమయంలో నిఫ్టీ 6.45 శాతం క్షీణించింది. కరోనా మహమ్మారితో దేశం పోరాటం నేపథ్యంలో ఈ ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఏర్పడిందని, దీంతో షేర్లు పెరుగుతున్నాయని విశ్లేషకులు తెలిపారు.
మంగళవారం మార్కెట్‌లో ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, డాబర్, ఇమామి, మారికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, కోల్‌గేట్ పామోలివ్ లాంటి ఇతర ఇతర ఎఫ్‌ఎంసిజి షేర్లు కూడా ఒక్కొక్కటి 5-10 శాతం మధ్య ట్రేడవుతుండటం విశేషం. కీలక సూచీల్లో సెన్సెక్స్ 2289 పాయింట్లకు పైగా లాభపడుతుండగా, నిఫ్టీ 657 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.