కరోనా మహమ్మారి విజృంభణ మమూలుగా లేదు. భారత్ లో ఈ వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ నుంచి దేశాన్ని రక్షించేందుకు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ... కేసులు తగ్గకపోవడం గమనార్హం. తాజాగా... ఒక కుటుంబంలో దాదాపు 25మందికి కరోనా సోకింది. ఈ సంఘటన మహారాష్ట్ర్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహరాష్ట్రలోని సాంగ్లీలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన 25 మందికి కరోనా సోకింది. వారంతా ఇరుకు ఇంట్లో నివసిస్తుండడంతో వైరస్‌ వేగంగా వ్యాపించింది. సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చిన ఆ కుటుంబంలోని నలుగురు ముందుగా మహమ్మారి బారినపడినట్లు ఈ నెల 23న నిర్ధారణ అయింది. 

కేవలం వారం రోజులు తిరిగేలోపే.. మరో 21 మంది కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ సోకింది. వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇరుకు ఇంట్లో అంతా కలిసుండడం వల్ల వారం వ్యవధిలోనే పాతిక మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు.

Also Read తెలుగు రాష్ట్రాలపై నిజాముద్దీన్ బాంబు: ఢిల్లీ నుంచే కారోనా వ్యాప్తి...

ఇదిలా ఉండగా... దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 1,071కు పెరిగాయి. 24 గంటల్లో 106 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మృతుల సంఖ్య 29కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 10 మరణాలు నమోదయ్యాయి. ఇది మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ. పుణెలో కరోనా సోకిన 52 ఏళ్ల వ్యక్తి సోమవారం మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 3 రోజుల క్రితం మరణించిన 38 ఏళ్ల వ్యక్తి నమూనాల పరీక్షా ఫలితాలు సోమవారం వచ్చాయి. అతనికి కరోనా ఉన్నట్లు తేలింది. 

కేరళలో కొత్తగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 213కు చేరింది. దేశంలో ఇదే అత్యధికం. 193 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఒక్క రోజులో తమిళనాడులో 17, ఉత్తరప్రదేశ్‌లో 16 కేసులు నమోదయ్యాయి. 

దీంతో ఆ రాష్ట్రాల్లో మొత్తం కేసులు వరుసగా 67, 88కి చేరాయి. కర్ణాటకలో 80, ఉత్తరప్రదేశ్‌ 88, గుజరాత్‌ 69, రాజస్థాన్‌ 60, ఢిల్లీ 53, పంజాబ్‌ 38, హరియా ణా, మధ్యప్రదేశ్‌ 33 చొప్పున, జమ్మూ కశ్మీర్‌ 45, పశ్చిమ బెంగాల్‌ 22, లద్దాఖ్‌ 13, బిహార్‌ 11, అండమాన్‌ నికోబార్‌ 10, చండీగఢ్‌ 8, చత్తీ్‌సగఢ్‌, ఉత్తరాఖండ్‌ 7 చొప్పున, గోవా 5, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిసాలో మూడు చొప్పున, పుదుచ్చేరి, మి జోరాం, మణిపూర్‌ ఒక్కో కేసు నమోదయ్యాయి.