Asianet News TeluguAsianet News Telugu

కరోనా సంక్షోభం: ఇదే కరెక్ట్ టైం... ఇల్లు కొనుగోలు బెస్ట్ ఆప్షన్

కరోనా సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు, ఇతర ఫైనాన్సియల్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రత్యామ్నాయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొనుగోలు చేయడమే మెరుగైన ఆప్షన్ అని దేశంలోని ఏడు మెట్రో పాలిటన్ నగరాల ప్రజలు భావిస్తున్నారు.
 

Housing becomes preferred asset amid coronavirus crisis: Report
Author
Hyderabad, First Published May 5, 2020, 1:27 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహహ్మారి ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు, ఫైనాన్సియల్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. వివిధ రంగాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. పెట్టుబడి దారులకు ప్రత్యామ్నాయ మదుపు మార్గంగా బంగారం కనిపించినా.. బులియన్ మార్కెట్ అనిశ్చితికి గురవుతున్నది. 

ఇటువంటి పరిస్థితుల్లో సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయమని దేశంలోని మెట్రో నగరాల ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల నియంత్రణలను ఎత్తివేసిన వెంటనే ఇంటి కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని చెబుతున్నారు.

ఫైనాన్షియల్‌‌ మార్కెట్లు కుప్పకూలడం, ఇతర ఇన్వెస్ట్‌‌మెంట్ మార్గాలు ఆకర్షణీయంగా లేవు కాబట్టి రెసిడెన్షియల్‌‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌‌ చేస్తామని మెట్రో నగరాల వాసులు అభిప్రాయ పడుతున్నారు.  లాక్‌‌డౌన్‌‌ కారణంగా ఇండ్ల ధరలు కూడా తగ్గుతాయన్న అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చాలా మంది సొంతిల్లు కొనడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పేరు ఉన్న, ప్రభుత్వ సంస్థలు నిర్మించే ఇళ్లను కొనడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్‌’ తెలిపింది.

దేశంలోని‌ ఏడు పెద్ద నగరాల పరిధిలోని రెండు వేల మందితో ‘అన్‌రాక్’ నిర్వహించిన సర్వేలో 75 శాతం మంది త్వరలో ఇల్లు కొంటామని చెప్పారు. ఢిల్లీ డెవెలప్‌‌మెంట్‌‌ అథారిటీ, హరియాణా అర్బన్‌‌ డెవెలప్‌‌మెంట్‌‌ అథారిటీ, మహారాష్ట్ర హౌజింగ్‌‌ అండ్‌‌ ఏరియా డెవెలప్‌‌మెంట్‌‌ అథారిటీ వంటి ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఇండ్లు కొనడానికి ప్రాముఖ్యం ఇస్తామని 14 శాతం మంది చెప్పారు.

ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తారనే పేరు ఉన్న కంపెనీల నుంచి ఇల్లు తీసుకుంటామని 62 శాతం మంది నగర వాసులు అన్నారు. ప్రాజెక్టులు ఆలస్యంగా పూర్తయినా ఫర్లేదు కానీ ఇంటి ధర తక్కువగా ఉంటేనే కొంటామని ఆరు శాతం మంది పేర్కొన్నారు. 

also read లాక్‌డౌన్‌ సడలింపుతో తగ్గనున్న బంగారం ధరలు...

ఎగ్జిక్యూషన్‌‌ రిస్కులు కాస్త తక్కువ ఉన్న డెవలపర్లను ఎంచుకుంటామని 18 శాతం మంది అన్నారు. లేబర్‌‌ కొరత, రా మెటీరియల్‌‌, లిక్విడిటీ లేకపోవడం వంటి సమస్యలను ఎగ్జిక్యూషన్‌‌ రిస్కులుగా పిలుస్తారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రెసిడెన్షియల్‌‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం తెలివైన పని అని 48 శాతం మంది స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిపై ఆసక్తి ఉందని 25 శాతం మంది, బంగారం కొంటామని 18 శాతం మంది, ఎఫ్‌‌డీల్లో ఇన్వెస్ట్‌‌ చేస్తామని తొమ్మిది శాతం మంది చెప్పారు.

ఫ్లాట్‌‌ కొనాలన్న ప్లాన్‌‌ను కొంతకాలం పక్కనబెడతామని 16 శాతం మంది చెప్పారు. 6–12 నెలల్లోపు ఫ్లాట్‌‌ కొంటామని 28 శాతం మంది చెప్పారు. ఢిల్లీ, ముంబై, కోల్‌‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌‌, పుణెలో గత ఏడాది 2.61 లక్షల హౌజింగ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో బ్రాండెడ్‌‌ డెవలపర్ల వాటా 54 శాతం కాగా, మిగతా ఇళ్లను నాన్‌‌–బ్రాండెడ్‌‌ డెవలపర్లు విక్రయించారు.

ఈ ఏడాదిలో మార్చి వరకు ఈ ఏడు సిటీల్లో 42,500 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో బ్రాండెడ్‌‌ డెవలపర్ల వాటా 59 శాతం వరకు ఉంది. కనీసం పదేళ్ల నుంచి రియల్టీ రంగంలో ఉంటూ మార్కెట్లో లిస్టయిన కంపెనీలను బ్రాండెడ్‌‌ డెవలపర్లని అంటారు. ఇతర ఇన్వెస్ట్‌‌మెంట్లు ఆకర్షణీయంగా లేకపోవడం, రెంట్లు ఎక్కువ ఉండటంతో పాటు హౌజింగ్‌‌ లోన్ల వడ్డీలు తక్కువ ఉండటంతో యువ ఉద్యోగుల్లో చాలా మంది ఇల్లు కొనడానికి ఇష్టపడుతున్నారు.

బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌‌లో ఇల్లు కొంటామని 82 శాతం మంది కొనుగోలు దారులు చెప్పారు. వీరిలో కొందరు ఇది వరకే ఫ్లాట్లను బుక్‌‌ చేసుకున్నారు.హౌజింగ్‌‌ మార్కెట్‌‌కు డిమాండ్‌‌ ఉన్నప్పటికీ, ప్రాజెక్టుల నిర్మాణం జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉండటంతో రియాల్టీ ప్రాజెక్టులలో పనిచేసే వలస కూలీల్లో చాలా మంది సొంతూళ్లకు వెళ్లారు. మిగతావారు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. కరోనా భయం వల్ల చాలా మంది పనికి రావడానికి ఇష్టపడటం లేదని డెవెలపర్లు చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios