కార్పొరేట్ కంపెనీలకు శుభవార్త : ఏడాది వరకు ‘దివాళా’చర్యలుండవ్...
కరోనాతో అష్టకష్టాల పాలవుతున్న కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆరు నెలల వరకు దివాళా చర్యల నుంచి మినహాయింపునిస్తూ ఆర్డినెన్స్ రూపొందించింది. రాష్ట్రపతి దీన్ని ఆమోదిస్తే.. వచ్చే ఆరు నెలల పాటు దివాళా చర్యలు ఉండవు.. అలాగే ఈ సవరణను ఏడాది వరకు పొడిగించవచ్చునని కేంద్రం సంకేతాలిచ్చింది.
న్యూఢిల్లీ: కరోనా నెలకొల్పిన కల్లోలంతో సంక్షోభంలో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. ఇంకా భారీగా దివాళాకు గురికాకుండా 6 నెలల వరకు కంపెనీలకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టింది.
వచ్చే 6 నెలలు కంపెనీలకు దివాళా నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ అనుమతించింది. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కంపెనీలు తమ రున వాయిదాలను సకాలంలో చెల్లించకపోయినా, దివాళా చట్టం కింద కొత్త డీఫాల్ట్ కేసులను నమోదు చేయబోమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన సూచనల ఆధారంగా 2016 ఇన్సాల్వెన్సీ అండ్ దివాళా కోడ్ (ఐబీసీ)ను సవరిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ఆర్డినెన్స్ రూపొందించింది. అయితే ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం రావాల్సి ఉంది.
దివాళా చట్టంలోని కొత్త సెక్షన్ 10ఏకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే 7, 9, 10 సెక్షన్లను తాత్కాలికంగా పక్కన పెట్టనున్నారు. అయితే సవరించిన ఈ నిబంధనను సంవత్సరానికి మించి పొడిగించలేమని కేంద్రం స్పష్టం చేసింది.
కరోనా వైరస్ కష్టాలు.. లాక్‌డౌన్ నష్టాలు వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందని నిపుణులు అభినందించారు. ఇది దేశంలోని వ్యాపార వర్గాలకు మరింత స్థిరత్వాన్నిస్తుందని అభిప్రాపయడ్డారు. గత నెలాఖరులో తొలి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఇది ఒక ఆచరణాత్మక చర్య అని భావిస్తున్నారు.
లాక్ డౌన్ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిన సమయంలో, ఐబీసీని 6 నెలలు నిలిపివేయడం ఆర్థిక బలాన్నిస్తుందని డెలాయిట్ ఆర్థిక సలహా అధ్యక్షుడు ఉదయ్ భన్సాలీ అన్నారు. ఒక సంస్థకు అవసరమైన ఫైనాన్సింగ్, రుణాల గురించి తిరిగి చర్చలు జరపడానికి, బ్యాంకుల నుండి ఇతర ఉపశమనాలను పొందటానికి అవకాశం లభిస్తుందన్నారు.
కాగా ప్రస్తుత పరిస్థితి ఏప్రిల్ 30 దాటినట్లయితే, ఐబీసీ 2016 లోని సెక్షన్ 7, 9, 10 లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మార్చి 24 న చెప్పిన సంగతి విదితమే.
ఐబీసీ నిబంధనల సవరణతో కార్పొరేట్లకు బ్యాంకులు రుణాలను పునర్‌వ్యవస్థీకరించేందుకూ అవకాశం ఏర్పడింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం తీసుకున్న రుణాలకు సంబంధించిన కిస్తీలను 90 రోజులకు మించి చెల్లించకపోయినైట్లెతే సదరు రుణగ్రహీతలను రుణదాతలు దివాలా ప్రక్రియకు లాగవచ్చు.