న్యూఢిల్లీ: సెర్చ్​ ఇంజిన్​ దిగ్గజం గూగుల్​ 2019లో రికార్డు స్థాయిలో 'చెత్త' ప్రకటనలను తొలిగించినట్లు వెల్లడించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్న, గూగుల్​ నిబంధనలను ఉల్లంఘించిన ప్రకటనలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై వ్యాప్తి చెందుతున్న నకిలీ ప్రకటనలపై ద్రుష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. 

2019లో ఏడాదిలో 270 కోట్ల ప్రకటనలను తొలగించటం లేదా బ్లాక్ చేసినట్లు గూగుల్​ స్పష్టం చేసింది. అంటే నిమిషానికి 5 వేల యాడ్​లను తీసేసింది. అంతేకాక 2.1 కోట్ల వెబ్​ పేజీల నుంచి దాదాపు 12 లక్షల మంది ఖాతాలపై వేటు వేసింది.

కరోనా సంక్షోభం వేళ డిమాండ్​ పెరిగిన మాస్కులకు సంబంధించి నకిలీ ప్రకటనలనూ గుర్తించినట్లు గూగుల్ తెలిపింది. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునే నకిలీలపై దృష్టి పెట్టామని గూగుల్ ప్రకటన విభాగం ఉపాధ్యక్షుడు స్కాట్ స్పెన్సర్​ స్పష్టం చేశారు.

also read అందరు ఎదురుచూస్తున్న వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌...?

‘మా మాధ్యమాల్లో సమగ్రతను కాపాడతాం. కరోనా సంక్షోభంలోనూ మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. మా విధానాలు, నిబంధనలను ఉల్లంఘించేవారిని తొలగిస్తాం. వినియోగదారుల, ప్రకటనదారుల భద్రత కోసం వేలాది మంది గూగుల్ ఉద్యోగులం పనిచేస్తున్నాం’ అని స్కాట్ స్పెన్సర్ తెలిపారు.

ఇందుకోసం కొవిడ్​- 19 టాస్క్​ఫోర్స్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు స్కాట్ తెలిపారు. కొన్ని నెలలుగా కరోనా సంబంధిత తప్పుడు ప్రచారాలను తొలగిస్తున్నామని వెల్లడించారు. నిరుద్యోగం, వైద్య పరికరాలు, మందుల కొరత ఇలా అనేక రకాల అంశాలపై దృష్టి పెట్టామన్నారు.