తిరువనంతపురం:కేరళ రాష్ట్రంలో వృద్ద దంపతులు కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. డయాబెటిస్, హైపర్ టెన్షన్ తో పాటు ఇతర సమస్యలు ఉన్నా కూడ ఈ దంపతులు కరోనా వైరస్ ను జయించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ ప్రకటించారు.

 దేశంలో తొలుత కరోనా పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది.

రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులకు కూడ కరోనా వైరస్ సోకింది. ఈ దంపతులు ఇటీవలనే  ఇటలీకి వెళ్లి వచ్చారు. కొడుకుతో కలిసి ఈ దంపతులు ఇటలీ నుండి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. వీరితో పాటు ఇతర కుటుంబసభ్యులకు కూడ కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.

దీంతో వారిని కొట్టాయం మెడికల్ కాలేజీలో ఉంచి చికిత్స అందించారు. సుమారు 40 మంది వైద్య నిపుణులు ఈ దంపతులకు చికిత్స అందించారు. వైద్యులు ఇచ్చిన సలహలను క్రమం తప్పకుండా  పాటించడంతో ఈ దంపతులు ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

also read:దేశంలో 24 గంటల్లో 92 కరోనా పాజిటివ్ కేసులు, నలుగురు మృతి

డయాబెటిస్ లాంటి సమస్యతో పాటు వయోభారం ఉన్నా కూడ వైద్యులు చేసిన సూచనలు ఈ దంపతులు పాటించడంతో ఎలాంటి ఇబ్బందులు కూడ ఎదురు కాలేదని వైద్యులు అబిప్రాయపడుతున్నారు.

ఈ దంపతులకు చికిత్స నిర్వహించిన ఓ నర్సుకు  కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. నర్సు ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి శైలజ కుటుంబసభ్యులను ఆరా తీశారు.