న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ఓవైపు మద్యం సరిగ్గా లభించక మందుబాబులు చిందులు తొక్కుతుంటే.. మరోవైపు వ్యాపారాలు మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం నిల్వలు భారీగా మిగిలిపోయి వాటి యజమానులు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండు వారాల్లో మందుబాబులకు వారికి ఇష్టమైన బ్రాండ్ లిక్కర్ బాటిళ్లను ఇళ్ల వద్దకే సరఫరా చేసేందుకు రెండు వారాల్లో 7,8 రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినివ్వనున్నాయి. 

ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ‘మద్యం @హోం’ డెలివరీ కోసం అనుమతినిచ్చాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం హోం డెలివరీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ) చైర్మన్ అమ్రిత్ కిరణ్ సింగ్ తెలిపారు. 

ఈ నేపథ్యంలో మద్యాన్ని ఇళ్ల వద్దకే సరఫరా (హోం డెలివరీ) చేసేందుకు అనుమతించాలని లిక్కర్‌ పరిశ్రమతోపాటు బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు, కొన్ని ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. కొవిడ్‌-19 సంక్షోభంతో దెబ్బతిన్న రంగాలను కాపాడుకొనేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపాయి. 

మద్యం కొనుగోలు ఆర్డర్లను స్వీకరించేలా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ లాంటి ఈ-కామర్స్‌ సంస్థలకు, జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలకు ప్రత్యేక లైసెన్సు ఇవ్వాలని ఆలిండియా బ్రూవర్స్‌ అసోసియేషన్‌ (ఏఐబీఏ) సూచించింది. అంతేకాకుండా మద్యం ఆర్డర్ల కోసం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేయాలని, ఇది రాష్ట్ర ఎక్సైజ్‌ విభాగాల ఆధీనంలో ఉండేలా చూడాలని ప్రతిపాదించింది. 

ప్రభుత్వం అనుమతిస్తే మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయమై ప్రస్తుతం వివిధ విభాగాల అధికారులకు, స్విగ్గీ లాంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌డెలివరీ సంస్థలకు మధ్య చర్చలు జరుగుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. 

also read 6 నెలలు దాటితే కష్టమే: స్టార్టప్‌లపై తేల్చేసిన క్రిష్ గోపాలక్రిష్ణన్

ఆన్‌లైన్‌ ద్వారా మద్యాన్ని ఇళ్ల వద్దకు సరఫరా చేయడాన్ని వ్యవస్థీకృతంగా మార్చడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని, ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి సహాయ, సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత మద్యం తయారీ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) డైరెక్టర్‌ జనరల్‌ వినోద్‌ గిరి తెలిపారు. 

కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లలో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన మద్యం నిల్వలు మిగిలిపోయాయి. వీటిని అమ్ముకొనేందుకు అనుమతి ఇవ్వాలని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఓవైపు భారీగా పేరుకుపోయిన మద్యం నిల్వలు, మరోవైపు నగదు కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు అనురాగ్‌ కత్రియార్‌ తెలిపారు. ఇప్పటికే పలు రాష్ర్టాలు మద్యం రిటైల్‌ అమ్మకాలకు అనుమతి ఇవ్వడంతో తమకూ అనుమతి లభిస్తుందని రెస్టారెంట్లు, హోటళ్లు ఆశగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 

‘మా వద్ద ఉన్న మద్యం నిల్వలను హోం డెలివరీ పద్ధతిలో అమ్ముకొనేందుకు అనుమతించాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో మా వద్ద ఉన్న నిల్వలను తగ్గించుకొనేందుకు, ప్రజల తక్షణావసరాలను తీర్చేందుకు వీలుగా కొంత డబ్బును సమకూర్చుకొనేందుకు వీలవుతుంది’ అని కత్రియార్‌ పేర్కొన్నారు.