ఫ్లోర్ లీడర్ల భేటీ: ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఓవైసీ
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన తలపెట్టిన ఫ్లోర్ లీడర్ల సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఎంఐఎం హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఐదుగురికి మించి సభ్యులున్న పార్టీలకే ఆహ్వానం వెళ్లింది.
హైదరాబాద్: ఫ్లోర్ లీడర్ల సమావేశానికి తాను పాల్గొనే అవకాశం లేకపోవడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. రాజ్యసభ, లోకసభ ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొనడానికి కనీసం ఐదుగురు సభ్యుల బలం ఉండాలి. దాంతో ఈ సమావేశంలో పాల్గొనడానికి అసదుద్దీన్ ఓవైసీకి అవకాశం లేకుండా పోయింది.
ఆ కారణంగా మోడీపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తాను హైదరాబాదు లోకసభ స్థానానికి, తమ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఔరంగాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గుర్తు చేస్తూ తమ అభిప్రాయాలను వినిపించే అవకాశాన్ని కల్పించడం లేదని ఓవైసీ అన్నారు.
హైదరాబాదులో 93 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని, కరోనా మహమ్మారిపై తాము చేస్తున్న పోరాటంపై వినిపించే అవకాశం తనకు ఇవ్వాలని, అదే విధంగా ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పే అవకాశం కూడా తనకు కల్పించాలని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఫ్లోర్ లీడర్ల సమావేశంపై స్పందిచారు.
మరో ట్వీట్ కూడా చేస్తూ పీఎంఓకు ట్యాగ్ చేశారు. తమ పార్టీని ఓటర్లు ఎన్నుకున్న హైదరాబాదు, ఔరంగాబాద్ ఓటర్లు తక్కువ స్థాయి మానవులా అని ఆయన ప్రశ్నించారు. తాము మీ దృష్టికి ఎందుకు రాలేదో చెప్పాలని ఆయన అడిగారు. ప్రజల దయనీయ పరిస్థితిని, ఆర్థిక స్థితిని వినిపించడం తమ విధి అని ఆయన అన్నారు.