న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. కరోనా దెబ్బకు మునుపెన్నడూ ఎదురుకాని మహా మాంద్యం ముంచుకు వస్తున్నది. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ -3.9 శాతానికి పతనం కావచ్చని తమ తాజా గ్లోబల్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌లో ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది.

మహమ్మారి విజృంభణతో అగ్ర దేశాలు సైతం అల్లాడుతున్న విషయం తెలిసిందే. నిర్మూలన తప్ప ఔషధమే లేని ఈ వైరస్‌ అంతానికి యావత్‌ ప్రపంచం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సంగతీ విదితమే. 

ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత దేశ జీడీపీ 0.8 శాతానికే పరిమితం కావచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ గురువారం అంచనా వేసింది. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీస్తున్నదని, ఆ ప్రభావం భారత్‌పైనా ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది.

దేశంలో లాక్‌డౌన్‌ పరిస్థితులు ఆర్థిక ప్రతిష్ఠంభనను సృష్టించాయని ఫిచ్‌ రేటింగ్స్‌  పేర్కొన్నది. ఈ క్రమంలోనే ఈ ఏప్రిల్‌-జూన్‌లో -0.2 శాతం, జూలై-సెప్టెంబర్‌లో -0.1 శాతంగా జీడీపీ నమోదు కావచ్చన్నది. అయితే అక్టోబర్‌-డిసెంబర్‌లో పరిస్థితులు కుదుటపడవచ్చునని ఆశాభావం వ్యక్తం చేసింది.

భారతదేశంలో వినియోగ సామర్థ్యం దారుణంగా దెబ్బతిన్నదన్న ఫిచ్‌.. అయినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) 6.7 శాతం వృద్ధికి వీలుందని చెప్పడం గమనార్హం. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2019-20) దేశ వృద్ధిరేటును 4.9 శాతంగా అంచనా వేసింది.

మరోవైపు అంతర్జాతీయంగా కరోనా  నేపథ్యంలో ప్రపంచ యుద్ధాల తర్వాత ఎప్పుడూ చవిచూడని దారుణమైన ఆర్థిక పరిస్థితులు తలెత్తుతాయని ఫిచ్‌ హెచ్చరించింది. వైరస్‌ ఉధృతి కారణంగా 2019 జీడీపీతో పోల్చితే 2.8 లక్షల కోట్ల డాలర్లు, తమ గత అంచనాలతో పోల్చితే 4.5 లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఈ ఏడాది ప్రపంచం కోల్పోవచ్చని చెప్పింది. 

చాలా దేశాలు లాక్‌డౌన్‌లను పొడిగిస్తున్నాయన్న ఫిచ్‌.. దీని ప్రభావం సహజంగానే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఉంటుందని పేర్కొన్నది. యూరోజోన్‌ జీడీపీ -7 శాతం, అమెరికా -5.6 శాతం, బ్రిటన్‌ -6.3 శాతంగా ఉండొచ్చని చెప్పింది.

మాంద్యం గుప్పిట్లోకి భారత్‌ వెళ్లబోతున్నదని యాక్సిస్‌ బ్యాంక్‌ హెచ్చరించింది. గడిచిన 40 ఏండ్లలో తొలిసారిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారినపడే అవకాశాలు కనిపిస్తున్నాయని ఓ నివేదికలో పేర్కొన్నది. 

కరోనా వైరస్‌ కట్టడి కోసం అమలవుతున్న లాక్‌డౌన్‌.. దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నదని యాక్సిస్‌ బ్యాంక్ తెలిపింది. స్తంభించిన ఉత్పాదక రంగం, నిలిచిపోయిన వాణిజ్య రవాణాలతో జీడీపీ -1.7 శాతానికి దిగజారవచ్చని అంచనా వేసింది. 

రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌.. దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీస్తున్నదని సీఐఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ -0.9 శాతంగా నమోదు కావచ్చన్నది. 

అయితే 1.5 శాతం వరకు వృద్ధికీ అవకాశాలున్నాయని సీఐఐ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదిలావుంటే లాక్‌డౌన్‌ పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థను 1990వ దశకం నాటికి క్షీణింపజేశాయని రాయిటర్స్‌ ఓ నివేదికలో అభిప్రాయపడింది.

‘ప్రపంచ జీడీపీ ఈ ఏడాది -3.9 శాతానికి పతనం కావచ్చు. మునుపెన్నడూ లేని మాంద్యం ముంచుకొస్తున్నది. ప్రపంచ యుద్ధాల తర్వాత ఇంతటి భీకర మాంద్యాన్ని మనమెప్పుడూ చవిచూసి ఉండమేమో’ అని ఫిచ్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్థికవేత్త బ్రియాన్‌ కౌల్టన్‌ చెప్పారు.