ముంబై: దేశీయ టెలికం దిగ్గజం రిల‌య‌న్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ భారీగా పెట్టుబ‌డులు పెట్టడానికి సిద్ధ‌మైంది. రిల‌య‌న్స్ డిజిట‌ల్ బిజినెస్‌ (జియో ప్లాట్‌ఫామ్స్) లో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కొనుగోలు చేయ‌నున్న‌ది.  ఈ మేరకు రిలయన్స్ జియో, ఫేస్ బుక్ వేర్వేరు ప్రకటనల్లో ఈ సంగతిని వెల్లడించాయి. 

సుమారు 5.7 బిలియ‌న్ల డాల‌ర్లతో అంటే రూ.43,574 కోట్ల విలువైన ఆ వాటాను ఫేస్‌బుక్ కొనుగోలు చేసేందుకు సిద్ద‌మైంది. దీంతో జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఫేస్ బుక్ నిలుస్తుంది. 

జియో ఫ్లాట్‌ఫామ్‌లో స్వ‌ల్ప పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ తెలిపారు. జియోలో ఓ టెక్నాల‌జీ కంపెనీ ఇంత పెట్టుబ‌డులు పెట్ట‌డం ఇదే తొలిసారి. భారత టెక్నాల‌జీ రంగంలోనూ ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ కావ‌డం విశేషం. 

ఫేస్‌బుక్ పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీ షేర్లు దూకుడు ప్ర‌ద‌ర్శించాయి. డాల‌ర్‌కు రూ.70  అన్న ఒప్పందం ప్ర‌కారం పెట్టుబ‌డులు జ‌రిగాయి. 

రిల‌య‌న్స్ జియోలో 9.99 శాతం వాటా కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌కు ముఖేశ్ అంబానీ స్వాగ‌తం ప‌లికారు. సుదీర్ఘ భాగ‌స్వామిగా త‌మ కంపెనీలో ఫేస్‌బుక్ చేర‌డం ప‌ట్ల అంబానీ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా భార‌త్‌.. ప్ర‌పంచంలో అతిపెద్ద డిజిట‌ల్ సొసైటీగా మారుతుంద‌న్నారు.

ఇండియాను డిజిట‌ల్ దేశంగా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తామ‌ని, దేశ ప్ర‌జ‌ల‌కు డిజిట‌ల్ స‌ర్వీసులు అందిస్తామ‌ని ముఖేశ్ అంబానీ త‌న వీడియో సందేశంలో తెలిపారు.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆయ‌న వీడియోలో మాట్లాడుతూ.. మీరంతా సుర‌క్షితంగా ఉన్నార‌ని భావిస్తున్న‌ట్లు అంబానీ అన్నారు. రిల‌య‌న్స్, జియో సంస్థ‌లు ఫేస్‌బుక్‌కు స్వాగ‌తం ప‌లికేందుకే ఉత్సాహాంగా ఉన్న‌ట్లు చెప్పారు. 

ఫేస్‌బుక్‌, రిల‌య‌న్స్ జియో క‌లిసిక‌ట్టుగా భార‌త డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తాయ‌న్న ముకేశ్ అంబానీ ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశాన్ని డిజిట‌ల్ రాజ్యంగా మార్చేందుకు ఫేస్‌బుక్ స‌హ‌క‌రిస్తుంద‌న్నారు. గ‌త కొన్నేళ్లుగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు దేశంలో ప్ర‌తి ఇంటిని ప‌లుక‌రించాయ‌న్నారు. 

ముఖ్యంగా దేశంలోని 23 భాష‌ల్లోనూ వాట్సాప్ అందుబాటులో ఉంద‌ని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. వాట్సాప్ కేవ‌లం డిజిట‌ల్ అప్లికేష‌న్ మాత్ర‌మే కాదు, అది అంద‌రి ప్రియ నేస్తంగా మారింద‌న్నారు. ఆ స్నేహితుడు.. కుటుంబాల‌ను, మిత్రుల‌ను, వ్యాపారుల‌ను. అంద‌ర్నీ ఒకే ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌స్తోంద‌ని అంబానీ అన్నారు.

ప్రస్తుతం జియో ప్లాట్​ఫాం పూర్తిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధీనంలో ఉంది. 2016లో సేవలు ప్రారంభించిన సంస్థ డిజిటల్ సేవలు సహా 38.8 కోట్ల చందాదారులతో దేశంలో అతిపెద్ద నెట్​వర్క్​గా అవతరించిన రిలయన్స్ జియో సైతం జియో ప్లాట్​ఫాం పరిధిలో ఉన్నాయి.

భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న  చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వడమే తమ లక్ష్యం అని రిలయన్స్ తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వాసులను ఏకం చేయాలని భావిస్తున్నామని పేర్కొంది. 

కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత పుంజుకోనున్న భారత ఆర్థిక వ్యవస్థకు జియో, ఫేస్ బుక్ బంధం బాటలు వేస్తుందని భావిస్తున్నట్లు రిలయన్స్ పేర్కొంది.

మరోవైపు ఫేస్ బుక్ స్పందిస్తూ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ వ్యవస్థలో భాగం కావాలన్న లక్ష్యంతోనే జియోతో జత కడుతున్నామని తెలిపింది. ప్రజలకు మెరుగైన సేవలందించడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్లేందుకు ఈ బంధం దోహదపడుతుందని అభిప్రాయ పడింది. 

ఇప్పటికే ఫేస్ బుక్ ఆధీనంలో ఉన్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో భారతీయ సమాజమే అతి పెద్దదని ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారత్ నిలయంగా మారుతున్నదన్నారు.