న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు మౌలానా పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ఈ నెలలో మత ప్రార్థనలు జరిగాయి. ఈ మతప్రార్థనలను పురస్కరించుకొని దేశంలోని పలు ప్రాంతాల నుండి ఈ ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చారు.

ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన వారి కారణంగానే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే రకమైన కారణంగానే ఏపీ రాష్ట్రంలో మంగళవారం నాడు ఒకేసారి 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ఉన్న వారిని పోలీసులు సోమవారం నాడు సాయంత్రం నుండి ఆసుపత్రులకు తరలించారు. సుమారు ఏడు వందల మందిని కరోనా అనుమానంతో ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు తరలించారు.

also read:చెస్ట్ ఆసుపత్రి నుండి 10 మంది ఇండోనేషియన్ల డిశ్చార్జ్: కానీ ట్విస్ట్ ఇదీ...

ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగిన మత ప్రార్థనల్లో సుమారు 2500 మందికి పైగా పాల్గొన్నారని సమాచారం. నిర్వాహకుల నుండి పోలీసులు మత ప్రార్థనలకు హాజరైన వారి సమాచారాన్ని సేకరించారు.

ఈ సమాచారాన్ని ఆయా రాష్ట్రాలకు పంపుతున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కూడ నిబంధనలను ఉల్లంఘించినందున చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. 

అయితే తాము లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించలేదని మర్కజ్ ప్రతినిధి ఢిల్లీ ఏసీపీ అతుల్ కుమార్ కు ఓ లేఖ రాశారు. నిబంధనలకు అనుగుణంగానే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారితో పాటు విదేశీ ప్రతినిధులు కూడ ఇక్కడే ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇక్కడ ఉన్న వారిలో ఎవరికి కూడ కరోనా పాజిటివ్ మర్కజ్ అధికార ప్రతినిధి డాక్టర్ మహ్మద్ షోయబ్ ప్రకటించారు. వయోభారంతో పాటు ప్రయాణం కారణంగా కొందరు ఆసుపత్రిలో చేరినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఎవరికి కూడ కరోనా వ్యాధి లక్షణాలు నిర్ధారణ కాలేదని ఆయన చెప్పారు.