వెయ్యి రూపాయలకే కరోనా వ్యాక్సిన్: సీరం ఇన్ స్టిట్యూట్...

కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ రూపకల్పనలో ముందడుగు పడింది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూ.1000లకే వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే సెప్టెంబర్, అక్టోబర్ మధ్య ఈ వ్యాక్సిన్ సిద్ధమవుతుందని తెలిపింది. 

Covid-19: Pune company plans to ready 20-40m vaccine shots at Rs 1,000/dose by Sept-Oct

ముంబై: దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను రూ.1000లకే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రముఖ వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు, సీఈవో అదర్‌ పూనావాలా చెప్పారు. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నాటికి రెండు నుంచి నాలుగు కోట్ల డోసులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మేలో మనుషులపై వ్యాక్సిన్‌ ఔషధ పరీక్షలు (హ్యూమన్‌ ట్రయల్స్‌) నిర్వహిస్తామన్నారు. 

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్‌ కోసం సెప్టెంబర్‌లో నిర్వహించబోయే ట్రయల్స్‌ కోసం తాము వేచి చూడట్లేదని పూనావాలా పేర్కొన్నారు. హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఈ నెల 23వ తేదీన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కన్సార్టియం ప్రకటించింది. ఇందులో అమెరికన్లు, చైనీయులు కూడా పాల్గొననున్నారు. 

సొంత వ్యయంతో, రిస్కుకు లోబడి మాకు మేముగా ట్రయల్స్‌ను నిర్వహించి.. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నామని అదర్ పూనావాలా తెలిపారు. వచ్చే నెలలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అవుతాయని ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు. సుమారు 100 మంది పేషంట్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని పూనావాలా అన్నారు.

ట్రయల్స్‌ విజయవంతమైతే మొదటి ఆరు మాసాలు నెలకు నలభై నుంచి యాభై లక్షల డోసులను, ఆతర్వాత క్రమంగా నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేస్తామని, ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ. 1,140 కోట్లను వెచ్చిస్తున్నామన్నారు. మనదేశంతోపాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని అదర్ పూనావాలా వెల్లడించారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సారథ్యంలోని కన్సార్టియంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా నియంత్రణ వ్యాక్సిన్ల తయారీలో పోటీ పడుతున్న గ్లోబల్ ఫార్మాస్యూటికల్ సంస్థల్లో సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లో కంటే దేశీయంగా తక్కువ ధరకే తాము ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని అదర్ పూనావాలా వెల్లడించారు. ఇంతకుముందు తట్టు, గవదబిళ్ల, రుబెల్లా వంటి వ్యాధులకు వ్యాక్సిన్లను తయారు చేసింది సీరం ఇన్‌స్టిట్యూట్. 

నూతన ఉత్పాదక ప్లాంట్ ప్రారంభించడానికి రూ.3000 కోట్లు అవసరమని, దానికి కొన్నేళ్ల సమయం పడుతుందని అదర్ పూనావాలా తెలిపారు. వ్యాక్సిన్ తయారీపై 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నామని, ప్రభుత్వం భాగస్వామి అయితే, తమకు నష్టాల నుంచి బయటపడేందుకు అవకాశం ఉందని పూనావాలా చెప్పారు. 

ఇతర వ్యాక్సిన్ల తయారీని నిలిపివేసి, కేవలం కరోనా వైరస్ ఉత్పత్తి చేయడానికే 60 మిలియన్ డాలర్లు అవసరం అని.. దీనివల్ల మరో 60 మిలియన్ల డాలర్లు నష్టపోవాల్సి వస్తుందని పూనావాలా తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios