Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకులకు తడిసిమోపెడు కానున్న మొండి బాకీలు...

కరోనా మహమ్మారి ప్రభావంతో మరింత బ్యాంకర్లపై వ్యయ భారం పడుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ హెచ్చరించింది. ఇది పెట్టుబడి దారులకు మరింత కష్టాలను తెచ్చి పెడుతుందని పేర్కొంది. 
 

Covid-19 Impact: Banks to witness spike in credit costs, non-performing assets in 2020
Author
Hyderabad, First Published Apr 7, 2020, 2:55 PM IST

ముంబై: కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయతాండవం ఆర్థిక వ్యసస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేస్తుందన్న అంచనాల మధ్య వెలువడిన ఓ నివేదిక భారత బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత కలవరపెడుతోంది. 2020లో బ్యాంకుల మొండి బాకీలు భారీగా పెరగనున్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ నివేదిక స్పష్టం చేసింది. 

అలాగే బ్యాంకుల రుణ వ్యయం మరింత భారం కానుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ అంచనా వేసింది. ‘ఏసియా-పసిఫిక్‌ బ్యాంక్స్‌, కొవిడ్‌-19 క్రైసిస్‌’ పేరిట విడుదలైన ఈ నివేదిక 2020లో దేశంలో మొండి బాకీల నిష్పత్తి 1.9 శాతం, రుణ వ్యయ నిష్పత్తి 130 బేసిస్‌ పాయింట్లు పెరగనుందని నివేదిక లెక్కగట్టింది.

అదే చైనా విషయానికి వస్తే ఇవి వరుసగా 2శాతం, 100 బేసిస్‌ పాయింట్లు ఉండనుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత వేగంగా, విస్తృతంగా, సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ క్రెడిట్‌ అనలిస్ట్‌ గవిన్‌ గన్నింగ్‌ తెలిపారు.

దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై అంచనాలకు మించి ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారుల కష్టాల్ని ఇది మరింత పెంచుతుందని, ఇది బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రెడిట్ అనలిస్ట్ గవిన్ గన్నింగ్ తెలిపారు.

2020లో రుణదాతల రుణవ్యయ భారం 300 బిలియన్‌ డాలర్లు, మొండి బకాయిలు 600 బిలియన్‌ డాలర్లు పెరిగే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ తొలిదశ ప్రభావం బ్యాంకులపై అంతగా ఉండదని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది. తొలుత కార్పొరేట్‌ రంగం తీవ్ర గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుందని అనంతరం ఆ ప్రభావం బ్యాంకులపై ఉంటుందని స్పష్టం చేసింది. ఆసియా ప్రాంతంలోని 20 బ్యాంకింగ్‌ రంగాల రేటింగ్‌ సామర్థ్యంపై కొవిడ్‌ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది.

also read కరోనాతో మరణిస్తే అది వెంటనే సెటిల్ చేయాలి: లైఫ్ ఇన్సూరెన్స్..

ఆయా ప్రభుత్వాలు, నియంత్రణా సంస్థలు తీసుకునే చర్యలు కీలకంగా మారనున్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటికే కొన్ని దేశాలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయన్నది. మరికొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని తెలిపింది. అయితే, చాలా దేశాలు ఇంకా ఆ దిశగా ఎలాంటి వ్యుహాలకు శ్రీకారం చుట్టలేదని స్పష్టం చేసింది. 

ఆర్థిక సంక్షోభ ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే భారతీయ రిజర్వ్‌ బ్యాంకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రెపో రేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే వివిధ సర్దుబాట్ల ద్వారా రూ. 3.74 లక్షల కోట్లను బ్యాంకింగ్‌ రంగంలోకి చొప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.

అయితే, తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో పెట్టడం కష్టసాధ్యమని.. ఒకవేళ చేసినా ఆర్థికంగా తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని గన్నింగ్‌ అభిప్రాయపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios