కరోనా వైరస్: మాస్క్ లు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య, కూతురు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భార్య మృదుల, కూతురు నైమిష లాక్ డౌన్ నేపథ్యంలో విలువైన పని చేస్తున్నారు ఇంట్లో కుట్టు మిషన్ పై మాస్కులు కుట్టడంలో వాళ్లు నిమగ్నమయ్యారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తమ వంతు సేవలను అందించడానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సతీమణి, కూతురు సిద్ధపడ్డారు. అవసరమైనవారికి అందించడానికి వారిద్దరు మాస్కులు కుడుతున్నారు. ఇంట్లో తయారు చేసిన, రీయూజబుల్ మాస్కులను వాడాలని గత వారం కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది.
మాస్కులు ధరించి ఇంట్లోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. ఈ క్లిష్టపరిస్థితిలో సమాజానికి మన వంతు సేవలు అందించాలని ఆయన అన్నారు. ఇంట్లో తమ కోసం సేఫ్ట్ మాస్కులు తయారు చేస్తున్న తన బార్య మృదుల, కూతురు నైమిషలను చూసి గర్విస్తున్నానని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
మీ నైపుణ్యాలకు పదును పెట్టుకోవడానికి, కొత్త నైపుణ్యాలను సాధించడానికి ఇది తగిన సమయమని ఆయన ట్విట్టర్ లో అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన సందేశాన్ని ఇచ్చారు.
సంప్రదాయబద్దమైన కుట్టు మిషన్ పై కింద కూర్చుని మాస్కులు కుడుతున్న తన భార్య మృదుల ప్రధాన్, నైమిష ప్రధాన్ ఫొటోలను తన ట్వీట్ కు జత చేశాడు.
గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,194కు చేరుకుంది. కొత్తగా 773 కేసులు నమోదయ్యాయి. దేశంలో మరో 35 మరణాలు సంభవించాయి.
మహారాష్ట్ర (1018), తమిళనాడు (690), తెలంగాణ (364), కేరళ (336) రాష్ట్రాలు కరోనా వైరస్ వ్యాధితో విలవిలలాడుతున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ను కొనసాగించాలని పట్టుబడుతున్నాయి.