ఫ్యాక్టరీల్లో కార్మికుల కొరత..సప్లయిలో ఇబ్బందులు... మెడిసిన్స్ ప్రొడక్షన్ ప్రాబ్లం
రెండు, మూడు నెలల వరకు ఔషధాల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) తెలిపింది. కరోనా లాక్ డౌన్ ఎప్పుడు నిలిచిపోతుందో చెప్పలేమని, ముడి సరుకుల సరఫరాలో అంతరాయం ఇబ్బందికరంగా మారిందని ఓపీపీఐ డీజీ అనంతక్రుష్ణన్ చెప్పారు. కార్మికుల కొరత కూడా సమస్యగా తయారైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: ఔషధ తయారీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్ వల్ల దినసరి కార్మికులు వారి సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోయారు. ఊరికెళ్లకుండా ప్రొడక్షన్ యూనిట్లు గల సిటీలు, పట్టణాల్లో ఉన్నవారు కాస్త వైరస్ భయంతో విధులకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తగ్గింది. వెరశి ప్లాంట్ల వినియోగం 50 నుంచి 70 శాతం మాత్రమే నమోదవుతోంది.
ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) అంచనాల ప్రకారం ఫార్మాస్యూటికల్ పరిశ్రమల సప్లయ్ చెయిన్‌లో అంతరాయం ఏర్పడింది. దీనికి కరోనా వైరస్ ప్రభావమే కారణమని ఓపీపీఐ పేర్కొంది. పరిస్థితులు ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేదు. వచ్చే రెండు, మూడు నెలలకు సరిపడా ఔషధాల కొరత తలెత్తడని ఓపీపీఐ వెల్లడించింది.
ఓపీపీఐ డైరెక్టర్ జనరల్ కేజీ అనంతక్రుష్ణన్ మాట్లాడుతూ ‘ఎప్పుడు లాక్ డౌన్ ముగుస్తుందో ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. దీనికి తోడు కార్మికులు విధులకు హాజరు కాకపోవడం ఉత్పత్తికి సవాల్‌గా మారింది. ఒకవేళ కార్మికులు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా అనుమతించడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇదే అతిపెద్ద సవాల్’ అని వ్యాఖ్యానించారు.
ముందస్తు వేతన చెల్లింపులు, ఆహారం, రవాణా వసతి కల్పించిన భారీ సంస్థల్లో ప్లాంట్ల వినియోగం 70 శాతం వరకు ఉంటే.. చిన్న, మధ్య తరహా కంపెనీల్లో 50–60 శాతం మాత్రమే ఉందని ఫార్మా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల పనితీరుపై తీవ్ర ప్రభా వం ఉంటుందని అంటున్నాయి.
కరోనా వైరస్ ప్రభావం వల్ల ఉత్పత్తి తగ్గుదలతో మార్జిన్లు భారీగా తగ్గుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతుల్లో 60%, దేశీయ మార్కెట్లో 50 శాతం వాటాను భారీ కంపెనీలు దక్కించుకున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఓపీపీఐ డైరెక్టర్ జనరల్ కేజీ అనంతక్రుష్ణన్ తెలిపారు. ఉత్పత్తి విషయంలో అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. సామాజిక దూరం పాటించడంతోపాటు కార్మికుల వ్యక్తిగత భద్రత పరిరక్షణ కేజీ అనంతక్రుష్ణన్ చెప్పారు. నెమ్మదిగా పరిస్థితి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
also read ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు...ఒక్కరోజులో రికార్డు స్థాయికి...10గ్రా పసిడి ధర..
కరోనా ప్రభావం ఆరు నెలల వరకు ఫార్మా రంగంపై ఉంటుందని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) చెబుతోంది. కార్మికుల కొరత వాస్తవమేనని బీడీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు.
‘ఔషధాల కోసం డిమాండ్ బాగానే ఉంది. కంపెనీల వద్ద నిల్వలూ ఉన్నాయి. రెండు మూడు నెలల్లో వైరస్‌కు కట్టడి పడ్డా.. ఈ రంగం తిరిగి గాడిన పడేందుకు మరో రెండు మూడు నెలల సమయం పడుతుంది. కంపెనీల ఆదాయంతోపాటు లాభాలూ కుచించుకుపోతాయి’ అని ఈశ్వర్ రెడ్డి చెప్పారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితి నుంచి భారీ స్థాయి కంపెనీలు నెట్టుకొస్తాయి. చిన్న కంపెనీలకే సమస్య. వీటిల్లో కొన్ని కంపెనీల ప్లాంట్లు తాత్కాలికంగా మూతపడే అవకాశాలూ లేకపోలేదన్న విమర్శలు ఉన్నాయి. పోర్టుల వద్దా కార్మికుల కొరత ఉందని, ఇది కూడా సమస్యేనని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ్ భాస్కర్ తెలిపారు.
2020–21లో ఫార్మా రంగం పనితీరు ఎలా ఉంటుందో ఆ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేయలేకపోతున్నాయి. చైనాలో సమస్య మొదలవగానే తయారీ విషయంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నట్టు లారస్ ల్యాబ్స్ వెల్లడించింది. కార్మికుల కొరత వంటి సమస్యలు తమకు లేవని వివరించింది.
భారత ఔషధ రంగానికి ఇది క్లిష్ట సమయమని ప్రముఖ లిస్టెడ్ కంపెనీ డైరెక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి విషయంలో విదేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
‘త్వరలోనే సమస్య నుంచి గట్టెక్కుతాం. భారత్ నుంచి ఔషధాల ఎగుమతులకు ఎటువంటి సమస్య లేదు. ఇక్కడి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దేశీయంగానూ మార్కెట్ ఉత్తమంగా ఉంటుంది. ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నా అంతా సర్దుకుంటుంది’ అని ఆ లిస్టెడ్ కంపెనీ డైరెక్టర్ పేర్కొన్నారు.
‘అంతర్జాతీయంగా ఔషధాల ధరలు మెరుగ్గా ఉన్నాయి. జూన్ నుంచి మార్కెట్ గాడిలో పడుతుంది. కంపెనీలు అధిక లాభాలను ఇచ్చే ఔషధాల తయారీపై దృష్టిసారిస్తాయి. ఇదే జరిగితే ఎగుమతుల్లో ఎంత కాదన్నా 10–15 శాతం వృద్ధి సాధిస్తాం. ప్రభుత్వం సైతం ఎగుమతుల వృద్ధికి తోడ్పాటు అందిస్తోంది’ అని అయన వివరించారు.