న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన ఆటోమొబైల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు దేశంలోకెల్లా అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ సోమవారం తన కార్యకలాపాలు ప్రారంభించింది. 

దేశవ్యాప్తంగా హీరో మోటో కార్ప్స్ తన మూడు ప్లాంట్లలో కార్యకలాపాలు ప్రారంభించింది. హర్యానాలోని గుర్‌గ్రామ్, దారుహెరా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ ప్లాంట్లతోపాటు రాజస్థాన్ రాష్ట్రంలోని గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌లో కార్యకలాపాలను మొదలు పెట్టింది. 

పారిశ్రామిక రంగంలో ఉత్పాదక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి మూడో విడత లాక్ డౌన్‌ అమలు వేళ కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లోని స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత హీరో మోటో కార్ప్స్ తన కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని తెలిపింది. 

బుధవారం నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని హీరో మోటో కార్ప్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక్కడ నుంచి వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

also read కరోనా ఎఫెక్ట్: ఒక్క బైక్ అమ్ముడు పోలేదు.. కానీ..

లాక్ డౌన్ అమలులో ఉన్నా మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న హీరో ఎక్స్ టెన్సివ్ కస్టమర్ టచ్ పాయింట్లు, డీలర్ షిప్స్, వర్క్ షాపులు సైతం క్రమంగా తెరుచుకుంటాయని తెలిపింది. హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతోపాటు రాజస్థాన్ నీమ్ రాణా, గుజరాత్ రాష్ట్రంలోని హలాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో సంస్థకు ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. 

అత్యవసర సిబ్బంది మాత్రమే తమ కంపెనీ ప్లాంట్లకు వచ్చి సామాజిక దూరం, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనిచేస్తారని కంపెనీ ప్రకటించింది. మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది. 

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో మార్చి 22వ తేదీ నుంచి హీరో మోటో కార్ప్స్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కుదేలవుతున్న వివిధ రంగాల పరిశ్రమల అధినేతలు, ప్రతినిధులు తమకు ఉద్దీపనలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కానీ హీరో మోటో కార్ప్స్ తమకు ఉద్దీపన అవసరం లేదని ప్రకటించింది.