కరోనా వైరస్ ఇష్యూ: ఎదురు లేని కేసీఆర్, జగన్ కు చంద్రబాబు మంట
ప్రాణాంతకమైన కరోనా వైరస్ మీద పోరాటంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏ విధమైన రాజకీయ వ్యతిరేకత ఎదురు కావడం లేదు. అయితే, ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం రాజకీయంగా ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు.
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఏ విధమైన వ్యతిరేకత ఎదురు కావడం లేదు. తెలంగాణ శానససభ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెసు నేత మల్లుభట్టి విక్రమార్క కొన్ని వ్యాఖ్యలు చేశారు. శాసనసభలోనే కేసీఆర్ ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టడమే కాకుండా ఈ దేశానికి పట్టిన వైరస్ కాంగ్రెసు అని వ్యాఖ్యానించారు.
అప్పటి నుంచి తెలంగాణలో కరోనా వైరస్ కట్టడికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఏ విధమైన విమర్శలు కూడా రావడం లేదు. బిజెపి నుంచి కూడా ఆయనకు వ్యతిరేకత ఎదురు కావడం లేదు. కరోనా వైరస్ కట్టడి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చర్యలకు వందశాతం కేసీఆర్ మద్దతు ప్రకటిస్తున్నారు. మోడీపై కొంత మంది చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. దాంతో కేసీఆర్ ను విమర్శించడానికి రాష్ట్ర బిజెపి నేతలకు కూడా ఏమీ దొరకడ లేదు.
నిజానికి. తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 11 మంది మరణించారు కూడా. అయితే, కరోనా వైరస్ జాడలు కనిపించినప్పటి నుంచి కూడా కేసీఆర్ ప్రజలకు తాము తీసుకుంటున్న చర్యల గురించి మాత్రమే కాకుండా, ప్రజలు చేయాల్సిన పనుల గురించి కూడా నిక్చచ్చిగా చెబుతూ వస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిరంతరం పర్యవేక్షణలోనే ఉంటున్నారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి ఏ విధమైన విమర్శలు కూడా రావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ప్రజలు ఎదురు తిరిగే ప్రమాదం కూడా ఉందని గ్రహించి ప్రతిపక్షాలు పల్లెత్తు మాట అనడం లేదు.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తప్పు పట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. తాము అన్ని విధాలా సహకరిస్తామని చెబుతూనే ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారు. జగన్ ఎవరితోనూ మాట్లాడడం లేదని, చేయాలంటే విమర్శలు చాలా ఉన్నాయని ఆయన సోమవారం అన్నారు. బుద్ధా వెంకన్న, బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు వంటి పలువురు టీడిపి నేతలు ఏదో విధంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలుత పెద్దగా కరోనా వైరస్ కేసులు కనిపించలేదు. కానీ ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గండంగా మారారు. దీంతో ఎప్పటికప్పుడు జగన్ ప్రభుత్వం తాను తీసుకుంటున్న చర్యలను వివరిస్తూనే ఉంది. అధికారులు, మంత్రులు ఆ చర్యలను చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ నేతల నుంచి విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఆపత్కాలంలో తాము అండగా ఉంటామని అంటూనే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వారికితోడు, వామపక్షాల నేతలు, బిజెపి నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. వారి విమర్శలను మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కన్నబాబు వంటివారు తిప్పికొడుతూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, రాజకీయ సమరం సాగిస్తూనే కరోనా వైరస్ పై పోరాటం చేయాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదుర్కుంటున్నారు.
కేసీఆర్ విమర్శలకు దూరంగా ఉండడానికి, జగన్ పై విమర్శలు రావడానికి కారణాలు రాజకీయపరమైనవే తప్ప సమస్యకు సంబంధించినవి కావని అనిపిస్తోంది. అంతేకాకుండా, జగన్, కేసీఆర్ మాట్లాడే తీరులో ఉన్న వ్యత్యాసం కూడా అందుకు కారణం కావచ్చు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడడానికి గానీ ఏమీ ఉండదు. అంతేకాకుండా ఆయన ప్రజలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుంటారు. అంటే, ప్రజలను తన మాటలతో ఒప్పిస్తారు. అందువల్ల కేసీఆర్ ను విమర్శించడం ప్రతిపక్షాలకు అంత సులభంగా ఉండదు. అంతేకాకుండా మరో ప్రాంతీయ పార్టీ బలంగా లేదు. ఒక రకంగా కులాతీత రాజకీయాలు తక్కువ కావడం కూడా అందుకు మరో కారణం.
జగన్ విషయానికి వస్తే, కేసీఆర్ లాగా ఎదురు లేకుండా మాట్లాడలేరు. ఆయన చెప్పే విషయాల మధ్య చాలా గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ ను నింపుతూ ఆయన మాట్లాడలేరు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ బలంగానే ఉంది. ప్రజలు కూడా సమస్యలను బట్టి కాకుండా పార్టీలను బట్టి విడివిడిగానే ఉంటూ వస్తారు. దానివల్ల సమస్యలపై కన్నా టీడీపీ, వైసీపీలు నాయకులు మాత్రమే కాకుండా, ఆ రెండు పార్టీల మధ్య విడిపోయిన ప్రజానీకం కూడా పరస్పరం తప్పులను వెతుక్కోవడానికే ప్రాధాన్యం ఇస్తారు.