కర్ణాటకలో మరో కరోనా మరణం: నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
కర్ణాటకలో కరోనా వైరస్ కారణంగా మరో వ్యక్తి మరణించాడు. దీంతో కరోనా వైరస్ మరణాల సంఖ్య కర్ణాటకలో నాలుగుకు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 128 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ సోకి మరో వ్యక్తి మరణించాడు. దీంతో కర్ణాటకలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 128కు చేరుకుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో 229 కేసులు నమోదు కాగా, 11 మంది మరణించారు.
భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 2,547కు చేరుకుంది. ఇందులో 157 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 62 మంది మరణించారు.
మహరాష్ట్రలో అత్యధికంగా 335 కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానం తమిళనాడు ఆక్రమించింది. తమిళనాడులో 309 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. కేరళలో 286 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఢిల్లీలో 219 కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 172 కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మరణించారు.
ఏప్రిల్ 3వ తేదీనాటికి తబ్లిగి జమాత్ కు సంబంధించినవే 647 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా 1,097,909 కేసులు నమోదు కాగా, వందలాది దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అమెరికా, ఇటలీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికాలో 276,995 కేసులు నమోదు కాగా, ఇటలీలో 119,827 కేసులు నమోదయ్యాయి.