కరోనాను కట్టడి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరు మాత్రం ఏ మాత్రం బాధ్యత లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు.

అదే సమయంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000కి చేరడంతో కేంద్ర ప్రభుత్వం కఠినచర్యలకు చేరింది. లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also Read:కరోనాపై గెలుపుకు కఠిన నిర్ణయాలు, పేదలకు క్షమాపణ: మన్‌కీ బాత్‌లో మోడీ

కరోనా కట్టడికి చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై కేంద్ర హోంశాఖ ఆదివారం రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని కట్టడి చేయాలని స్పష్టం చేసింది.

రాష్ట్రాల మధ్య సరిహద్దులు పూర్తిగా మూసివేయాలని, కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని చెప్పింది. ఆదేశాలను ఉల్లంఘించి ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Aslo Read:గుజరాత్‌లో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరిక: అహ్మదాబాద్‌లో ఒకరి మృతి

హద్దుమీరి ప్రయాణాలు చేసిన వారిని 14 రోజుల పాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాలని సూచించింది. ఇవాళ మన్‌కీబాత్‌లో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ... కరోనాపై గెలవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని తేల్చిచెప్పారు.

పేద ప్రజలకు కలిగిన ఇబ్బందులకు క్షమాపణలు కోరుతున్నట్లుగా ఆయన తెలిపారు. కాగా ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 987 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 25 మరణాలు సంభవించాయి.