కరోనా కాలంలో సైకిళ్లకు ఫుల్ డిమాండ్.. ఉత్పత్తి లేక కొరత
కరోనా కాలంలో సైకిళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వ్యాయామం చేయడానికి జిమ్ లేక, వాకింగ్ చేయడానికి వీలు లేకపోవడంతో సైకిళ్ల డిమాండ్ కు రెక్కలొచ్చాయి. యూరప్, అమెరికా దేశాల్లో పెరిగిన డిమాండ్‌తో సైకిళ్ల కొరత ఏర్పడింది.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణతో చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిమ్‌లు మూతపడ్డాయి.
వ్యాయామం, కాలినడక కోసం కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల్లో చూడనివిధంగా ఒకేసారి సైకిళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికాలో అతిపెద్ద రిటైల్ మార్కెట్ వాల్‌మార్ట్, టార్గెట్ కేంద్రాలలో ఉన్న సైకిళ్ల ర్యాక్‌లన్నీ ఖాళీ అయ్యాయి. అంతేకాక చిన్న షాపుల్లోని సైకిళ్లు కూడా దాదాపు అమ్ముడయ్యాయి.
అయితే, మహమ్మారి విజృంభణ కారణంగా అమెరికాలో గత రెండు నెలలుగా ఏర్పడ్డ చమురు సంక్షోభంతో సైకిల్ విక్రయాలు భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాలో వైరస్ విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో నిత్యావసర వస్తువుల కోసం ఎగబడినట్లు ప్రస్తుతం వీటికోసం పరుగెడుతున్నట్లు సైకిల్ ఇండస్ట్రీ నిపుణులు జయ్ టౌన్లీ తెలిపారు.
ముఖ్యంగా చిన్నారుల సైకిళ్ల కంటే పెద్దవారు వాడే సైకిళ్లు, ఈ-బైకుల విక్రయాలు మూడింతలు పెరిగాయని మార్కెట్ విశ్లేషణ సంస్థ ఎన్‌పీడీ గ్రూప్ వెల్లడించింది. ఇక చిన్నారులు వాడే ఎలక్ట్రిక్ బైకుల విక్రయం కూడా రెట్టింపైనట్లు తెలిపింది. స్వల్ప కాలంలో భారీగా డిమాండ్ పెరగడంతో అమెరికాలో సైకిళ్లకు భారీ కొరత ఏర్పడింది.
అమెరికాలో లభించే దాదాపు 90శాతం సైకిళ్లు చైనా నుంచే దిగుమతి అవుతాయి. ప్రస్తుతం అక్కడ పూర్తిగా స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో ఈ కొరత ఏర్పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డిమాండ్ మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. మనీలా, రోమ్ నగరాల్లో కార్లు పార్కు చేసినట్లుగా ప్రస్తుతం భారీగా సైకిల్ పార్కింగ్‌లతో వీధులు నిండిపోతున్నాయి.
also read తగ్గిన బంగారం, వెండి ధరలు...కరోనా కేసులే ఇందుకు కారణం... ...
మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి గత సంవత్సరంతో పోలిస్తే అమెరికాలో 138శాతం, బ్రిటన్‌లో 184శాతం తమ సైకిళ్ల అమ్మకాలు పెరిగాయని నెదర్లాండ్స్‌కు చెందిన ఈ-బైకర్ కంపెనీ వ్యాన్‌మూఫ్ వెల్లడించింది.
దీంతో ఉత్పత్తి భారీగా పెంచినా డిమాండ్‌ను అధిగమించేందుకు మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చని తెలిపింది. బెల్జియంకు చెందిన మరో ఈ-బైకర్ కంపెనీ కౌబాయ్ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రజలు సైకిళ్లవైపు మళ్లడమే దీనికి కారణమని నిపుణులు అన్నారు. దీనిలోభాగంగా, నగరంలో కొన్ని ప్రాంతాల్లో కార్లనే నిషేధించే దిశగా లండన్ మునిసిపాలిటీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇక ఫిలిప్పైన్స్‌లో సాధారణంగా క్రిస్మస్ సమయంలోనే బైకుల విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. లాక్‌డౌన్ తర్వాత ఇటలీలో ప్రభుత్వం బైకుల కొనుగోలుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో విక్రయాలు విపరీతంగా పెరిగాయి.
అయితే సైకిళ్లతోపాటు ఈ-బైకులకు భారీ డిమాండు ఏర్పడడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణతో ప్రజారవాణ వ్యవస్థలకు దూరంగా ఉండటంతో సైకిళ్లకు డిమాండ్ ఏర్పడింది.
కరోనా కారణంగా వ్యాయామంకోసం జిమ్‌లకు వెళ్లలేకపోవడంతోపాటు లాక్‌డౌన్‌లో ఇళ్లకే పరిమితమైన సమయంలో తమ పిల్లలు ఉత్సహం, వ్యాయామం కోసం సైకిళ్లు వాడటం మరో కారణం.
ప్రజలు మార్కెట్‌కు, ఆఫీసులకు వెళ్లేందుకు ఈ-బైక్‌లను వినియోగించడంతోపాటు ఇతరుల మధ్య భౌతిక దూరం పాటించడం కోసం సైకిళ్లు వాడటం ఇంకొక కారణమని తెలుస్తున్నది. అయితే, ఇటీవలే అంతర్జాతీయ సైకిళ్ల దినోత్సవం సందర్భంగా ‘సైకిళ్ల’ తయారీకి మూలమైన అట్లాస్ సంస్థ తన చివరి యూనిట్ మూసివేయడం ఒకింత విషాదమే మరి.