రెస్టారెంట్లలో బిల్లు చెల్లించడానికి కొత్త విధానం.. క్యూఆర్ కోడ్ ద్వారా ఫుడ్ ఆర్డరింగ్..
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిలో ఆన్ లైన్ ఆర్డరింగ్, పేమెంట్స్ విధానం అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. కాంటాక్ట్ లెస్ డైనింగ్ ప్రోగ్రాం అందుబాటులోకి తెచ్చింది.
న్యూఢిల్లీ: ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు గానీ... వేరే ఊరికి వెళ్లినా.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి భోజనం కోసం రెస్టారెంట్‌కు, హోటల్‌కు వెళతాం.. రెస్టారెంట్‌లో కూర్చున్న వెంటనే ‘మెనూ ఎక్కడ’ అని అడిగి తెలుసుకుని మెనూ కార్డు, వాటిపై ధరలను చూసి మనకు ఇష్టమైన వాటిని ఆర్డర్ చేస్తాం.
తిన్న తరువాత బిల్లు చెల్లించడానికి డబ్బులు లేదా కార్డు ఇవ్వడం.. ఇలా ఎంతలేదన్నా కనీసం మూడు, నాలుగుసార్లు వస్తువులు చేతులు మారుతుంటాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో దీనికి సరికొత్త పరిష్కారం అందుబాటులోకి తెచ్చింది డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం.
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత రెస్టారెంట్లు, హోటళ్లలో భౌతిక స్పర్శలను తగ్గించడానికి ‘కాంట్రాక్ట్ లెస్ ఇన్ స్టోర్ ఆర్డరింగ్’ను అభివ్రుద్ధి చేసినట్లు పేటీఎం తెలిపింది. లక్ష రెస్టారెంట్లలో దీన్ని అమలు చేయాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకున్నది.
తొలుత దేశంలోని 30 అగ్రగామి నగరాల పరిధిలో పేటీఎం ఈ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. తదుపరి దశలో మిగతా నగరాలకు ఈ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేటీఎం ఓ ప్రకటనలో తెలిపింది.
‘కాంటాక్ట్ లెస్ ఇన్ స్టోర్ ఆర్డరింగ్’ సౌకర్యాన్ని అమలు చేసే రెస్టారెంట్లలో ఒక ‘క్యూఆర్’ కోడ్ ప్రదర్శిస్తారు. దీన్ని మన మొబైల్ ఫోన్‌లోని పేటీఎం యాప్‌తో స్కాన్ చేయగానే.. వినియోగదారులకు అవసరమైన మెనూ కనిపిస్తుంది.
also read లాక్‌డౌన్ తర్వాత కూడా వర్క్ ఫ్రం హోం...కానీ ఉద్యోగాల్లో కోతలు తప్పదు...
ఆర్డర్ కూడా అందులోనే ఇవ్వవచ్చు. బిల్లు కూడా కట్టొచ్చు.. దీంతో మెనూ కార్డును పట్టుకోనవసరం లేదు. సర్వర్లతో ఎక్కువ సమయం మాట్లాడాల్సిన అవసరం ఉండదు. తొలి దశలో లక్షకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నది.
మెనూ కార్డు తాకకుండా.. వ్యక్తుల మధ్య ఇంటరాక్షన్ తగ్గించడానికి ఈ ఐడియాను పేటీఎం ముందుకు తీసుకొచ్చింది. పేటీఎం వ్యాలెట్ తోపాటు పేటీఎం యూపీఐ, నెట్ బ్యాంకింగ్, అన్ని బ్యాంకుల కార్డులను ఈ సేవలకు వాడుకోవచ్చు. పేటీఎం యాప్‌లో లైవ్ ఆర్డర్ అప్ డేట్ కూడా కనిపిస్తుంది. ప్రతి రెస్టారెంట్ కూడా ఇందులో భాగస్వామి కావచ్చునని పేటీఎం తెలిపింది.
ప్రతి రెస్టారెంట్ పేటీఎం యాప్ లో తమకంటూ సొంత పేజీ ఏర్పాటు చేసుకోవచ్చునని పేర్కొంది. కాంటాక్ట్ లెస్ ఇన్ బోర్డ్ ఆర్డరింగ్ సౌకర్యం పాపులర్ కావడం కోసం వినియోగదారులకు ఆఫర్లు అందుబాటులోకి తెస్తోంది.
ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో కూడా తన యాప్‌లో కొత్త ఫీచర్లను జత చేయడానికి సిద్దం అవుతోంది. జొమాటో ఖాతాదారులు రెస్టారెంట్లకు ఆన్ లైన్ మెనూను ఉపయోగించుకుని ఆర్డర్ చేసి.. తర్వాత బిల్లు చెల్లింపులు వంటి ఫీచర్ చేర్చనున్నది.