Asianet News TeluguAsianet News Telugu

ఏడాది తర్వాతే ఆర్థిక వ్యవస్థ రికవరీ... ఈలోగా ఉద్యోగాలు గల్లంతే!

కరోనా ‘లాక్‌డౌన్‌’ ఎత్తివేసినా దేశీయ ఆర్థిక వ్యవస్థ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దేశంలోని పలు కంపెనీల సీఈఓలు  ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఏడాదైనా పడుతుందని వారి అంచనా. ఈ లోగా 15 నుంచి 30 శాతం కొలువులూ గల్లంతయ్యే ప్రమాదం ఉన్నదని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
 

CII Survey Revealed Recovery May Take Over A Year
Author
Hyderabad, First Published May 4, 2020, 10:29 AM IST

న్యూఢిల్లీ: కరోనా ‘లాక్‌డౌన్‌’ తర్వాత ఆర్థిక రంగానికి ‘కరోనా’ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఈ నెల 17  తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసినా ఆర్థిక, పారిశ్రామిక రంగాలు కోలుకునేందుకు ఏడాదికిపైగా సమయం పడుతుందని భావిస్తున్నారు. 

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన ఒక సర్వేలో 45 శాతం మంది సీఈఓలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు 300 మందికిపైగా కంపెనీల సీఈఓలను సంప్రదించి సీఐఐ ఈ సర్వే రూపొందించింది. 

ఈ సర్వేలో పాల్గొన్న సీఈఓల్లో మూడింట రెండొంతుల మంది సూక్ష్మ, మధ్య, చిన్న తరహా కంపెనీల (ఎంఎస్ఎంఈ) వారే. వీరిలో 65 శాతం మంది 2020 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీల రాబడులు 40 శాతానికి పైగా పడిపోతాయని చెప్పారు. 

ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా ఈ నష్టం 20 నుంచి 40 శాతం వరకు ఉండొచ్చని వీరి అంచనా.  అలాగే లాక్‌డౌన్‌ ముగిశాక వ్యాపార సంస్థల ఆర్థిక కార్యకలాపాలు మునుపటిలా సాధారణ స్థాయికి చేరుకోవడానికి ఏడాది సమయం పడుతుందని 45 శాతం మంది పేర్కొన్నారని సీఐఐ వెల్లడించింది. 

తమ రంగాలలో 15 నుంచి 30 శాతం మేర ఉద్యోగాలు కోత ఉండొచ్చని 45 శాతం మంది సీఈఓలు భావిస్తున్నారని నివేదికలో వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు తాము పనిచేసే సంస్థలు జీతాల్లో ఎలాంటి కోత విధించలేదని రెండిట మూడొంతుల మంది సీఈఓలు వెల్లడించారు. 

2020-21 ఆర్థిక సంవత్సరానికి 20 నుంచి 40 శాతం మేర ఆదాయం తగ్గుతుందనే అంచనా వేస్తున్నట్లు 32 శాతం సంస్థల సీఈఓలు తెలిపారు. కరోనా తర్వాత ఎగుమతుల కంటే దేశీయ డిమాండే ముందుగా పుంజుకుంటుందని వీరి అంచనా.


కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ జాగ్రత్తగా దశలవారీగా ఎత్తివేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించక తప్పదని సర్వే పేర్కొంది. అయితే లాక్‌డౌన్‌తో‌ వ్యాపార కార్యకలాపాలు ఆగిపోవడం, ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుండటంపై కూడా పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

also read కరోనా నియంత్రణపై ఈయూ, అమెరికాతో పోల్చొద్దు.. కిరణ్ మజుందార్

‘కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ అమలు ఎంతో అవసరం. అయితే ఇది సంస్థల ఆర్థిక కార్యకలాపాలను కూడా చిక్కుల్లోకి నెట్టింది. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నుంచి తిరిగి కోలుకొని, సాధారణ స్థితికి చేరుకునేందుకు పరిశ్రమ వర్గాలకు ప్రత్యేక ఉద్దీపనల అవసరం ఎంతో ఉంది’ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు.
 
కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను కొంత సడలించింది. అయితే రాష్ట్రాల నుంచి మాత్రం దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏ దుకాణాన్నీ అనుమతించకూడదని పలు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 

ఒకవేళ అనుమతించినా ఆహార పదార్ధాలు, నిత్యావసర వస్తువుల అమ్మకాన్ని మాత్రమే అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. దీనిపై స్పష్టత రానంత వరకు మాల్స్‌ పూర్తి స్థాయిలో తెరవడం కష్టమని రిటైల్‌ సంస్థలు భావిస్తున్నాయి. 

ఈ-కామర్స్‌ సంస్థలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల అమ్మకాలను చేపడుతున్నాయి. సోమవారం నుంచి నిత్యావసరేతర వస్తువుల విక్రయానికి ఈ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. 

అయితే ఈ సంస్థల ద్వారా తమ వస్తువులు అమ్మే వ్యాపారుల్లో ఎక్కువ మంది కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రెడ్‌ జోన్లలో ఉన్నారు. దీంతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ ఈ-కామ ర్స్‌ సంస్థల అమ్మకాలూ పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 

కరోనా కష్టాల నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్నీ సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు ఉండే అన్ని జిల్లాల్లో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అనుమతించాలని కోరింది. 

తద్వారా ఉద్యోగుల తీసివేతలను చాలా వరకు అడ్డుకోవచ్చని తెలిపింది. అయితే ఇదే సమయంలో కంపెనీలు, వ్యాపార సంస్థలు.. కార్మికులు, ఉద్యోగుల ‘ఆరోగ్య’ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జీడీపీలో ఆయా జిల్లాల వాటా, పరిశ్రమల సాంద్రత ఆధారంగా ఇలాంటి జిల్లాలను గుర్తించాలని సీఐఐ సూచించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios