రోజుకు 10, 20గా ఉన్న కరోనా కేసులతో వైరస్ ముప్పు భారత్‌లో తప్పిపోయిందని అనుకుంటున్న సమయంలో మర్కజ్ కార్యక్రమం ప్రభుత్వాన్ని, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

ఇంతటి కలవరానికి కారణమైన తబ్లీగి వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న విదేశీయులపై భారత ప్రభుత్వం కన్నెర్ర చేసింది. నిబంధనలు ఉల్లంఘించి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 960 మంది విదేశీయుల వీసాలను రద్దు చేయడంతో పాటు వారి పాస్‌పోర్టులను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది.

Also Read:కరోనా సోకిందని సోషల్ మీడియాలో ప్రచారం: యువకుడి ఆత్మహత్య, టెస్టుల్లో నెగిటివ్

ఆ విదేశీయులపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం గురువారం ట్వీట్ చేసింది. కాగా పర్యాటక వీసాలపై వచ్చిన పలువురు విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

విదేశీయుల చట్టం- 1946, విపత్త నిర్వహణ చట్టం- 2005ను వారు ఉల్లంఘించి నిజాముద్దీన్‌లోని తబ్లీగి జమాత్‌లోని మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు జమాత్ చీఫ్ మౌలానా షాద్ ఖాందల్వి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తబ్లీగి అనుచరులందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు.

Also Read:రేపు ఉదయం మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ: ఏం చెప్పబోతున్నారు...?

అధికారులు చెప్పిన ఆదేశాలను పాటించాలని, ఎక్కువగా గుమిగూడకుండా చూడాలని ఖాందల్వి విజ్ఞప్తి చేశారు. కాగా తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్న 9,000 మందిని క్వారంటైన్‌ చేశామని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి సంబంధీకులు సైతం నిర్బంధంలో ఉన్నారని ప్రకటించింది.