న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. వారి వ్యాలిడిటీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ తమ ఖాతాదారుల వ్యాలిడిటీ గడువును మే 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.

ఇప్పుడు జియో కూడా అదే బాటలో నడిచింది. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా లో-ఇన్‌కమ్ ఖాతాదారుల వ్యాలిడిటీని పొడిగించాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత కాలం తమ ఖాతాదారులు ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చని జియో వివరించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వచ్చేనెల మూడో తేదీ వరకు అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ అవకాశం కొంతమందికే కాదని, జియో ఖాతాదారులందరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ మాత్రం తక్కువ ఆదాయ వనరు కలిగిన ఖాతాదారులకు మాత్రమే ఈ అవకాశం కల్పించాయి. అయితే, ఇన్‌కమింగ్ కాల్స్ వ్యాలిడిటీ ఎప్పుటి వరకు అన్న విషయాన్ని మాత్రం జియో వెల్లడించలేదు. 

also read యూ-ట్యూబ్ కొత్త ఫీచర్...ఇకపై ఆన్ లైన్ పేమెంట్లు కూడా...

అయితే, లాక్‌డౌన్ గడువు ముగిసే వరకు ఈ వ్యాలిడిటీ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, లాక్‌డౌన్ మొదలైనప్పుడు వ్యాలిడిటీ ముగిసిన ఖాతాదారులకు కూడా ఈ పొడిగింపు వర్తిస్తుందా? అనే దానిపై జియో స్పష్టత ఇవ్వలేదు. లాక్ డౌన్ కాలంలో ప్లాన్ ముగిసినా.. ఆ కాలం పూర్తయ్యే వరకు ప్లాన్లను పొడిగిస్తున్నట్లు జియో తెలిపింది. 

మరోవైపు ఎయిర్ టెల్ తన ఖాతాదారులకు పరిమితంగానే లబ్ధి చేకూర్చనున్నది. మూడు కోట్ల మందికి పైగా సబ్ స్క్రైబర్లకు ఇన్ కమింగ్ కాల్స్ ఉచితంగా అందజేయనున్నది. దీనిని యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) ఆధారంగా నిర్ణయించనున్నది. 

వొడాఫోన్ ఐడియా తన యూజర్లకు ఇన్ కమింగ్ కాల్స్ పొడిగించింది. ఫీచర్ ఫోన్ వాడుతున్న తొమ్మిది కోట్ల మందికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు జీరో బ్యాలెన్స్ ఉన్నా లాక్ డౌన్ వరకు వారికి ప్రీపెయిడ్ ప్లాన్లు కొనసాగిస్తున్నది.