Asianet News TeluguAsianet News Telugu

జస్ట్ ఒక్క ఎస్‌ఎం‌ఎస్‌తో ఫోన్ రీచార్జీ... ఎలాగో తెలుసుకోండి

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్లలో ప్రీపెయిడ్ రీచార్జీ కోసం ఆయాసంస్థలు మొబైల్ యూజర్లకు ఊరటనిచ్చాయి. ఏటీఎం సెంటర్ల ద్వారా రీచార్జీ చేసుకోవచ్చు. ఎస్సెమ్మెస్ ద్వారా కూడా రీ చార్జీ చేసుకునేందుకు వీలుగా టెలికం దిగ్గజాలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ వివిధ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 

Airtel, Vodafone and Reliance Jio users can now recharge their numbers at ATMs
Author
Hyderabad, First Published Apr 6, 2020, 1:02 PM IST

ముంబై: దేశంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మొబైల్ వినియోగదారులకు టెలికం సంస్థలు ఊరటనిచ్చాయి. ప్రత్యేకించి ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకోలేని తమ వినియోగదారులను దృష్టిలో వుంచుకుని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇకపై తమ దగ్గరలోని ఏటీఎంలో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పించాయి.

టెలికాం దిగ్గజం జియో బాటలో నడిచిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ కూడా తమ కస్టమర్లకు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీంతోపాటు ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎంపిక చేసిన కొన్ని కిరాణా, ఫార్మసీ దుకాణాల్లో కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎయిర్‌టెల్ ఒక భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఎయిర్‌టెల్ వినియోగారులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల ఏటీఎంల వద్ద రీఛార్జ్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టర్డ్‌ బ్యాంకుల ఏటీఎంలలో మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. 

ఈ మేరకు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఈ బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. వినియోగదారులు ఈ బ్యాంకుల ఏటీఎంలలో దేన్నైనా సందర్శించి వారి రీఛార్జిని పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎయిర్‌టెల్‌ వినియోగదారులు బిగ్ బజార్స్ , అపోలో ఫార్మసీలకు కూడా వెళ్లి వారి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఏటీఎం రీచార్జ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.  ముందుగా కార్డును ఏటీఎంలలో ఇన్‌సెర్ట్ చేయాలి. తర్వాత ఏటీఎం మెషిన్ తెరపై కనిపించే మొబైల్ కంపెనీని ఎంచుకోవాలి. రీఛార్జ్ చేయదలిచిన మొబైల్ నంబర్‌ను, అటుపై రీఛార్జ్ చేసుకునే మొత్తాన్ని నమోదు చేయాలి. తరువాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. 

ఈ వివరాలన్నీ నమోదు చేసిన తరువాత ఎంటర్ చేస్తే ఫోన్ రీఛార్జ్ పూర్తి అయిందని నిర్ధారిస్తూ సందేశం వస్తుంది. రీచార్జ్ చేసుకున్న నగదుమీ బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ అవుతుంది. అలాగే మీ నెట్‌వర్క్ ఆపరేటర్ నుండి కూడా మెసేజ్ వస్తుంది. 

ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోలేని వారికి మాత్రమే ఏటీఎం రీఛార్జ్ సాధ్యమవుతుంది. దీంతోపాటు వొడాఫోన్‌ ఐడియా వినియోగదారులకు ఎస్ఎంఎస్ రీఛార్జ్ సౌకర్యం కూడా అందుబాటులో వుంది. ముఖ్యంగా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల కస్టమర్లు మాత్రమే ఎస్ఎంఎస్ రీఛార్జ్ ద్వారా చేసుకోవచ్చు.

మీ నంబర్ నుండి ఐడియా/వొడాఫోన్ నంబర్ టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, రీచార్జ్ సొమ్ము టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, ఐసీఐసీఐ, లేదా యాక్సిస్ బ్యాంక్ ఖాతా చివరి ఆరు అంకెలను నమోదు చేసి 9717000002 లేదా 5676782కు ఎస్ఎంఎస్ పంపితే రీచార్జ్ పూర్తవుతుంది.

కాగా కరోనా వైరస్ వల్ల ఇబ్బందుల నేపథ్యంలో జియో కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్‌ బ్యాంకుల ఏటీఎంలద్వారా మొబైల్ రీచార్జ్ సౌకర్యం కల్పించింది. 

అలాగే వినియోగదారుల వొడాఫోన్, ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల ప్రస్తుత ప్లాన్‌ల వాలిడిటీని ఏప్రిల్ 17వరకు పెంచాయి. తక్కువ ఆదాయ వినియోగదారుల ఖాతాలను రూ.10తో జమ చేశాయి. మరోవైపు రిలయన్స్ జియో కూడా ఏప్రిల్ 17 వరకు 100 కాల్స్, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను అందిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios