న్యూఢిల్లీ: దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ మీద ఎయిమ్స్ సంచలన ప్రకటన చేసింది. కరోనా వైరస్ మీద ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా కీలకమైన విషయాలు వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ మూడో దశకు చేరుకుందని, అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మూడో దశకు చేరుకుందని, అది కూడా మూడో దశ ప్రారంభ దశలోనే ఉందని ఆయన చెప్పారు. 

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరగుతుండడం ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా కరోనా వైరస్ సోకడాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు దాన్ని వైరస్ మూడో దశగా చెప్పుకోవచ్చునని అన్నారు. అయితే, ఈ దశ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉందని ఆయన చెప్పారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో రెండో దశలోనే ఉండడం ఊరట కలిగించే విషయమని అన్నారు. 

దాన్ని అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాన్ని ఎంత త్వరగా అరికడితే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. లేకపోతే మూడో దశ ఉధృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

ఢిల్లీలోని మర్కజ్ ఘటన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిందని ఆనయ చెప్పారు. ప్రార్థనల్లో పాల్గొన్నవారిని గుర్తించడం కష్టమే అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు సఫలమవుతున్నాయని అన్నారు. వైరస్ కట్టడికి ప్రజలు వైద్యులకు సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో లాక్ డౌన్ ఎత్తేయడం గురించి ఏమీ చెప్పలేమని, ఏప్రిల్ 10వ తేదీన పరిస్థితులను బట్టి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు.