ఎస్‌యూవీ కార్ల ఉత్పత్తి టార్గెట్: హిందూపురం ప్లాంట్‌లో 54 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు..
అనంతపురం జిల్లా హిందూపూర్ పరిధిలో ఉత్పాదక యూనిట్ ప్రారంభించిన కియా మోటార్స్ తాజాగా ఎస్‌యూవీ మోడల్ కార్ల తయారీ కసం 54 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది.
హైదరాబాద్/ అనంతపురం: దక్షిణ కొరియా ఆటోమొబైల్స్ తయారీ సంస్థ కియా మోటర్స్ తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకొనే పనిలో పడింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది.
మన కరెన్సీలో ఇది రూ.400 కోట్లకు పైమాటే. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వద్ద ఏర్పాటుచేసిన కార్ల ఉత్పత్తి ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు కియా మోటర్స్ ఇండియా సీఈవో కూఖ్యూన్ షిమ్ తెలిపారు. దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన 10 నెలల్లో భారీ విజయం సాధించామన్నారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డితో చర్చలు కూడా జరిపినట్లు తెలిపారు.
అనంతపురం జిల్లాలో ప్లాంట్ ఏర్పాటుచేయడానికి ఈ సంస్థ ఇదివరకే 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ యూనిట్ ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది. 536 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌లో ఏటా 3 లక్షల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి.
also read ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్...వచ్చే ఎడాది ఇండియాలో లాంచ్...
తాజాగా పెట్టే పెట్టుబడులను హిందూపూర్ ప్లాంట్‌లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) తయారు చేయడానికి ఖర్చు చేయనున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులకు కియా మోటార్స్ ఒక మోడల్ కానున్నదని కియా మోటర్స్ ఇండియా సీఈవో కూఖ్యూన్ షిమ్ చెప్పారు.
‘ఆంధ్రప్రదేశ్ వాసులకే ప్రస్తుతం 85 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నాం. పెట్టుబడులు పెంచడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి విజన్‌కు అనుగుణంగా పెట్టుబడులను విస్తరించాలని నిర్ణయించుకున్నాం’ అని కియా మోటర్స్ ఇండియా సీఈవో కూఖ్యూన్ షిమ్ తెలిపారు.
పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల బలం, సామర్థ్యాలను ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి వెల్లడించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు నాలుగు పోర్టులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని మంచి రహదారులు, రైల్వే లైన్లు మన బలమని వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రూ.లక్ష కోట్ల ఎగుమతి సామర్థ్యం ఉందని, అందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందన్నారు.