ముంబై: జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ భారత్‌లోని మూడు విభాగాలను ఏకం చేయనున్నట్లు సంస్థ తెలిపింది. వోక్స్‌వ్యాగన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, వోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ సేల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్కోడా ఆటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లను విలీనం చేయనున్నట్లు వోక్స్‌వ్యాగన్‌ ఇండియా మేనేజ్మెంట్ స్వయంగా బుధవారం వెల్లడించింది. 

స్కోడా సారథ్యంలో ‘ఇండియా 2.0’ ప్రాజెక్టు
స్కోడా నేతృత్వంలో చేపట్టిన ‘ఇండియా 2.0’ ప్రాజెక్టులో ఇది కీలకమైన మైలురాయి అని ఒక ప్రకటనలో పేర్కొంది. వోక్స్‌వ్యాగన్‌ బ్రాండ్‌ కింద వోక్స్‌వ్యాగన్‌, స్కోడా, ఆడీ, పోర్ష్‌, లంబోర్గిని ఉన్నాయి. ఈ సంస్థలన్నీ స్వతంత్రంగానే పనిచేస్తున్నాయి. కానీ, భారత్‌లో ఈ బ్రాండ్లన్నిటినీ వోక్స్‌ వ్యాగన్‌ ఇండియా ఎండీ గురుప్రతాప్‌ బోపరాయ్‌ పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఆయన వోక్స్‌వ్యాగన్‌, స్కోడా భారతీయ విభాగాల ఎండీగా ఉన్నారు.  

ఇవీ కారణాలన్న వోక్స్ వ్యాగన్ ఇండియా ఎండీ
‘భారత్‌ ప్రధాన కీలక మార్కెట్‌. ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విలీనంతో సాంకేతిక నిపుణులు , నిర్వహణ విషయంలో కలిసి వస్తాయి. భారత్‌ వంటి పోటీ మార్కెట్‌లో అప్పుడు వోక్స్‌ వ్యాగన్‌ అసలైన శక్తి బయటపడుతుంది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి చోటు చేసుకొంటాయి’అని బోపరాయ్‌ తెలిపారు. ఇప్పటికే ఈ విలీనాన్ని మూడు కంపెనీల బోర్డులు ఆమోదించాయి. ఇక రెగ్యూలేటరీ సంస్థలు ఆమోదించాల్సి ఉన్నది.

ఎలక్ట్రిక్ కార్ల రూపంలో ‘అంబాసిడార్’
భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో అంబాసిడర్‌ మళ్లీ రానున్నది.  మీకు ఆశ్చర్యం కలిగించినా ఇది మాత్రం నిజం. కాకపోతే ఈ సారి బ్రాండ్‌లా వివిధ ఎలక్ట్రానిక్‌ కార్ల రూపంలో ఇది దర్శనం ఇవ్వనుంది. ఫ్రాన్స్‌ కంపెనీ సెట్రోయెన్‌ తన సీ5 ఎయిర్‌ క్రాస్‌ ఎస్‌యూవీలను ఈ పేరుతో ప్రవేశపెట్టనుంది. అంబాసిడర్‌ బ్రాండ్‌నే కేవలం ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయానికి వినియోగించనుంది. 

మూడేళ్లలో రోడ్లపైకి ఎలక్ట్రిక్ అంబాసిడార్
ఎలక్ట్రిక్‌ అంబాసిడర్‌ 2022 నాటికి మార్కెట్లోకి రానుంది. భారతీయులకు అంబాసిడర్‌ కారుతో ఎంతో అనుబంధం ఉన్నది. ఈ నేపథ్యంలో భారత్‌లో అడుగుపెట్టేందుకు దానినే ఎన్నుకొంది. దీనిలో డీఎస్‌3 క్రాస్‌బాక్‌ ఈ టెన్స్‌ ఇంజిన్‌ను అమర్చనుంది. తొలుత కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కానీ, క్రాసోవర్‌ వాహనం కానీ మార్కెట్లోకి విడుదల కానుంది. 

అంబాసిడార్ బ్రాండ్ కొనుగులు చేసిన ఫ్రాన్స్ పీఎస్ఏ కంపెనీ 
ఫ్రాన్స్‌కు చెందిన పీఎస్‌ఏ కంపెనీ అంబాసిడర్‌ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిని హిందూస్థాన్‌ మోటార్స్‌ నుంచి కేవలం రూ.80 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు ఆ కంపెనీతో జాయింట్ వెంచర్ కూడా కుదుర్చుకుంది. రెండు కంపెనీలు కలిసి ఇంజిన్‌ తయారీ విభాగాన్ని తమిళనాడులో ప్రారంభించాయి.