రవాణాశాఖ కీలక నిర్ణయం..బీఎస్-6 వాహనాలకు ఇక స్పెషల్ స్టిక్కర్..
బీఎస్-6 వాహనాల నిబంధన అమలులోకి రావడంతో కేంద్ర హైవే, రవాణాశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. బీఎస్-6 వాహనాలకు ప్రత్యేక స్టిక్కర్ వాడాలని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా లాక్ డౌన్ అనంతర పరిస్థితుల్లో కస్టమర్లను ఆకర్షించడానికి టయోటా మూడు నుంచి తొమ్మిది వాయిదాల్లో రుణం చెల్లించి కారు పొందే ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో విక్రయించే బీఎస్-6 వాహనాలపై ప్రత్యేకమైన స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. హైవే, రోడ్డు రవాణాశాఖ ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌లో కొత్త మోడల్ స్టిక్కర్ జారీ చేస్తున్న సంగతిని తెలిపింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం బీఎస్-6 వాహనంపై సదరు స్టిక్కర్ ఒక సెంటీమీటర్ మేరకు రెండు రంగుల్లో లభించనున్నది. ఈ నిబంధన వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది. ఇటీవల సవరించిన మోటారు వాహన చట్టానికి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇప్పటికే 2019 ఏప్రిల్ తర్వాత విక్రయించిన అన్ని మోటారు వాహనాలపై టాంపర్డ్ ఫ్రూప్ నంబర్ ప్లేట్ అమర్చాలనే నిబంధన అమలులోకి వచ్చింది. తాజా నోటిఫికేషన్‌తో అమలులోకి రానున్న స్టిక్కర్‌ను కొత్త వాహనాల విండ్ షీల్డ్ పై అమర్చనున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ నిబంధన అమలు చేస్తున్న సంగతిని హైవే, రవాణాశాఖ గుర్తు చేసింది.
also read కారు కొంటే బహుమతి..ప్రభుత్వం సరికొత్త ఆలోచన...
పెట్రోల్, సీఎన్జీ వాహనాలపై లేత నీలం రంగులో, డీజిల్ వాహనాలపై ఆరెంజ్ రంగులో స్టిక్కర్ అమర్చారు. గత ఏప్రిల్ నుంచి బీఎస్-6 నిబంధన అమలులోకి వచ్చినందున ఖచ్చితంగా వాటిని అమలు చేయడానికి ఈ నిబంధనను తీసుకొచ్చామని హైవే రోడ్డు రవాణాశాఖ అధికారులు తెలిపారు.
తక్కువ వడ్డీరేట్లతో టయోటా ఈఎంఐ స్కీమ్
టయోటా ఈఎంఐ పథకం: ప్రస్తుత కష్టకాలంలో కస్టమర్లను ఆకర్షించేందుకు టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ తక్కువ వడ్డీ రేటుతో ఆకర్షణీయమైన ఈఎంఐ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ఆసక్తి గల వారు కారు కొనుగోలు, సర్వీసింగ్ మొత్తాన్ని మూడు గానీ, ఆరుగానీ, తొమ్మిది ఈఎంఐలలో చెల్లించవచ్చని తెలిపింది.
హీరో మోటో కార్ప్ ‘ఈ-షాప్’
దేశీయ ద్విచక్ర ఆటోమొబైల్ మేజర్ హీరో మోటో కార్ప్స్ తన డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ‘ఈ-షాప్’ పేరుతో దీనిని ప్రారంభించింది. సేల్స్ పెంచుకోవడానికి ఈ వేదికను ప్రారంభించామని వెల్లడించింది. భవిష్యత్ లో షోరూములకు వచ్చి కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గుముఖం పడుతుందని భావించిన హీరో మోటో కార్ప్ దీన్ని ప్రారంభించింది.