టయోటా కిర్లోస్కర్, మారుతి సుజుకి సంస్థల మధ్య సహకారంతో ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘మారుతి బాలెనో’ హ్యాచ్ బ్యాక్ కారు తరహాలో టయోటా గ్లాంజా మోడల్ కారును విపణిలోకి విడుదల కానున్నది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న మోడల్ కారు మారుతి బాలెనో. 

ఈ రెండు సంస్థల మధ్య సహకారంతో ఆవిష్క్రుతం కానున్న టయోటా గ్లాంజా కారు కావడం ఇదే మొదటిసారి. ఈ మేరకు టయోటా కిర్లోస్కర్ తాను విపణిలోకి విడుదల చేయనున్న మోడల్ గ్లాంజా టీజర్ బయటకు విడుదల చేసింది. 

ఇటీవల మారుతి సుజుకి విపణిలోకి ఆవిష్కరించిన బాలెనో ఫేస్ లిఫ్ట్ మోడల్ తరహాలోనూ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. సీ- పిల్లర్, టెయిల్ లాంప్ డిజైన్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది.

క్రోమ్ డోర్ హ్యాండిట్స్, రేర్ స్పాయిలర్స్ కూడా మారుతి బాలెనో మాదిరే డిజైన్ చేశారు. గ్రిల్లే మాత్రం పూర్తిగా నూతనంగా ఉంటుంది. వినియోగదారులపై ధరాభారం పడకుండా ఉండేందుకు టయోటా కిర్లోస్కర్ కూడా మారుతి బాలెనో ఫేస్ లిఫ్ట్ మోడల్ కారునే యధాతథంగా ‘గ్లాంజా’ రూపంలో విపణిలోకి తెస్తోంది.

ఇన్ సైడ్ క్యాబిన్‌లో మాత్రం ప్లస్ అప్‌హోల్డస్టరీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే కంపాటబిలిటీ గల టచ్ స్క్రీన్‌తో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చారు. స్మార్ట్ హైబ్రీడ్ టెక్నాలజీతో డ్యుయల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ల డ్యుయల్ జెట్ ఇంజిన్‌తో మారుతి సుజుకి బాలెనో ఫేస్ లిఫ్ట్ కారును ఆవిష్కరించింది.

అలాగే బీఎస్ -6 ప్రమాణాలతో కూడిన 1.2 లీటర్ల వీవీటీ పెట్రోల్ ఇంజిన్ వర్షన్ కారును ఆవిష్కరించింది. అంతేకాదు ఈ నెల 25వ తేదీన బాలెనో డీజిల్ వర్షన్ కార్ల ధరలను మారుతి సుజుకి పెంచేసింది. 

కానీ టయోటా కిర్లోస్కర్ తాజాగా విడుదల చేసే ‘గ్లాంజా’ మోడల్ కారును డీజిల్ వర్షన్‌లో విడుదల చేసేందుకు ముందుకు రాకపోవచ్చు. మారుతి సుజుకి బాలెనో ఫేస్ లిఫ్ట్ 84 హెచ్పీ, 115 ఎన్ఎం, 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సీవీటీ ఆప్షన్‌లోనూ అందుబాటులో ఉంటుంది.