ముంబై: ప్రయాణ కార్ల విక్రయాల్లో గతేడాది మహీంద్రా అండ్ మహీంద్రా తన మూడో స్థానాన్ని తిరిగి పొందగలిగింది. ఎప్పటి మాదిరిగానే ప్రయాణ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి మొదటి స్థానంలో కొనసాగుతున్నది. దక్షిణ కొరియా దిగ్గజం హ్యుండాయ్ మోటార్స్ , దాని తర్వాతీ స్థానంలో మహీంద్రా అండ్ మహీంద్రా నిలిచాయి. దేశీయ విక్రయాల్లో మాత్రం మరో దేశీయ ఆటోమొబైల్ మేజర్ ‘టాటా మోటార్స్’తో గట్టి పోటీని ఎదుర్కొంటున్నది మహీంద్రా అండ్ మహీంద్రా. 

గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మూడు నూతన మోడల్ కార్లు మర్రాజో ఎంవీపీ, ఆల్టూరాస్ ప్రీమియం ఎస్‌యూవీ, కంపాక్ట్ ఎక్స్‌యూవీ 300 కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో మహీంద్రా తన స్థానాన్ని కాపాడుకోగలిగింది.

అవును మరి ఫెస్టివల్ సీజన్‌లో నగదు కొరత, అధిక వడ్డీరేట్లు, పెట్రోల్-డీజిల్ ధరల్లో అనిశ్చితి వంటి అంశాలతోపాటు వరదల వల్ల చెప్పుకోదగిన రీతిలో వాహనాల సేల్స్ జరుగలేదు. బొలెరో, స్కార్పియో యుటిలిటీ వెహికల్స్ సాధారణంగా ఎక్కువగా అమ్ముడు పోతాయి. కానీ మహీంద్రా అండ్ మహీంద్రా 2.55 లక్షల ప్రయాణికుల కార్లను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే రెండు శాతం అదనం.

మరోవైపు టియాగో సబ్ కంపాక్ట్, నెక్సాన్ క్రాస్ ఓవర్ మోడల్ కార్లను ఆవిష్కరించిన టాటా మోటార్స్ గతేడాది 2.1 లక్షల ప్రయాణికుల కార్లను విక్రయించింది. 2017-18తో పోలిస్తే 12 శాతం పురోగతి నమోదు చేసినట్లే.  టియాగో, నెక్సాన్ కార్లతో టాటా మోటార్స్ అధిగమించగలిగింది. టాటా హారియర్ ప్రీమియర్ ఎస్‌యూవీ మొత్తం సేల్స్ పై గణనీయ ప్రభావం చూపకున్నా 10 వేల కార్ల కోసం బుకింగ్స్ నమోదయ్యాయి. 

టాటా మోటార్స్ ఎండీ గెంటర్ బుట్‌చెక్ మాట్లాడుతూ తాము నంబర్ త్రీ కోసం పోటీ పడటం లేదన్నారు. ఈ ఏడాది కొత్తగా ఒకే మోడల్ కారు హారియర్‌ను మార్కెట్లోకి విడుదల చేశామని, క్రమంగా సేల్స్ పెంచుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఏడాది విస్త్రుత స్థాయిలో వెహికల్స్ ఆవిష్కరించనున్నామని చెప్పారు. 

టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ తోపాటు పలు కొత్త మోడళ్లు మార్కెట్లోకి అడుగు పెట్టనున్నాయి. టాటా మోటార్స్ ప్రత్యర్థి సంస్థగా భావిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుతం తమ వద్ద గల వివిధ రకాల మోడల్ కార్ల డిజైన్లను రీ ప్రెష్ చేయాలని భావిస్తోంది. నూతనంగా టీయూవీ పేరిట యుటిలిటీ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయత్నిస్తోందన్నారు. 

మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ అధ్యక్షుడు రాజన్ వధేరా మాట్లాడుతూ మొత్తం యుటిలిటీ వెహికల్స్ గతేడాదితో పోలిస్తే 5.3 శాతం, తమ సంస్థ యుటిలిటీ వెహికల్స్ 4.3 శాతం పెరిగాయన్నారు. సంప్రదాయంగా ఎక్కువ మంది ఇష్టపడే బొలెరో, స్కార్ఫియో, ఎక్స్ యూవీ 500 మోడల్ కార్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి.