టెస్లా సరికొత్త రికార్డు..ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా..
నాస్‌డాక్ ఎక్స్చేంజీలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సరికొత్త రికార్డు నెలకొల్పింది. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉన్నా టెస్లా కంపెనీ షేర్ 1000 డాలర్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా టెస్లా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 6.5 శాతం డౌన్ అవుతుందని ఫెడ్ రిజర్వు అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి దూసుకువెళ్తుందని కూడా పేర్కొంది.
విభిన్న రంగాల తయారీ సంస్థ, నూతన తరం ఆటోమొబైల్ సంస్థ ‘టెస్లా ఇంక్’ సరికొత్త రికార్డును సాధించింది. బుధవారం అమెరికా మార్కెట్లు వెనకడుగు వేసినా ఈ సంస్థ షేర్ మాత్రం తొలిసారి 1,000 డాలర్ల మార్క్‌ను తాకింది. షేర్ 6.3 శాతం అంటే 59 డాలర్లకుపైగా జంప్‌చేసి 1,000 డాలర్ల ఫీట్‌ను సాధించింది.
తద్వారా కంపెనీ మార్కెట్ విలువ రీత్యా ఆటో రంగ దిగ్గజాలలో టాప్ ర్యాంకులో టెస్లా నిలిచింది. టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ 184 బిలియన్ డాలర్లను అధిగమించడంతో 179 బిలియన్ డాలర్ల విలువగల జపనీస్ ఆటో దిగ్గజం టయోటా ద్వితీయ స్థానానికి పరిమితమైంది.
ఇటీవల ఒక దశలో టెస్లా షేరు విలువ 760 డాలర్లకు చేరడంతో కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.. తమ సంస్థ షేర్ అత్యంత ఖరీదుగా మారిందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం! ఈ ఏడాది ఇప్పటి వరకూ టెస్లా ఇంక్ షేరు 125 శాతం దూసుకెళ్లడం విశేషం!
టెస్లా ఇంక్ కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహన(కార్ల) తయారీలో ముందంజలో ఉంది. ఈ బాటలోనే కరోనా మహమ్మారి ముప్పు ఉన్నా, ఎలక్ట్రిక్ సెమీట్రక్ ఉత్పత్తిని పెంచేందుకుసిద్ధం కావాలని ఎలన్ మస్క్ తాజాగా సిబ్బందిని కోరడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.
also read కస్టమర్లను ఆకట్టుకొనేందుకు మారుతీసుజుకీ ఆఫర్లు...పాతవాహనాలపై ఎక్స్చేంజ్ కూడా...
గిగా నెవడా ప్లాంటులో బ్యాటరీ, పవర్ ట్రయిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఉద్యోగులకు టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత కంపెనీ ఇటీవలే ప్లాంట్లను పునఃప్రారంభించింది.
వాల్‌మార్ట్, పెప్సీ తదితర దిగ్గజాల అవసరాలకు అనుగుణంగా సెమీ ట్రక్‌ను 2017లో కంపెనీ రూపొందించింది. మోడల్ 3 సెడాన్ కారుకు కనిపిస్తున్న డిమాండ్ సైతం టెస్లా షేరుకి బలాన్ని ఇస్తున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. మే నెలలో చైనాలో మోడల్-3 కార్లను 11,095 యూనిట్లు విక్రయించినట్లు తెలుస్తోంది.
రెండు రోజులపాటు పాలసీ సమీక్షను చేపట్టిన ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చునని అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలు ఉన్నట్లు పేర్కొంది. అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భవిష్యత్‌లో మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. వడ్డీ రేట్లను యథాతథంగా 0-0.25 శాతం స్థాయిలో కొనసాగించేందుకే ఫెడ్ రిజర్వ్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో బుధవారం డోజోన్స్ 282 పాయింట్లు (ఒక శాతం) క్షీణించి 26,990 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 17 పాయింట్లు (0.55 శాతం) నీరసించి 3,190 వద్ద ముగిసింది. అయితే నాస్‌డాక్ 67 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 10,020 వద్ద స్థిరపడింది.
తద్వారా వరుసగా మూడో రోజు డోజోన్స్ సరికొత్త గరిష్టం వద్ద ముగిసింది. ఇందుకు టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, యాపిల్ బలపడటం సహకరించింది. సెప్టెంబర్‌కల్లా కరోనా చికిత్సకు ఔషధాన్ని తీసుకువచ్చే వీలు ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ షేరు 1.3 శాతం లాభపడింది.