వాహన విక్రయాల్లో పోటీపడుతున్న దేశీయ ఆటోమొబైల్ సంస్థలైన టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా బాస్‌ వేతనాల్లో మాత్రం అంతరం ఎక్కువగా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరానికి టాటా మోటర్స్ ఎండీ, సీఈవో గ్యుంటర్ బుట్చెక్ రూ.26.29 కోట్ల వార్షిక వేతనాన్ని పొందారు.

అంతక్రితం ఏడాది పొందిన వేతనంతో పోలిస్తే 1.57 శాతం అధికమని కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఈ సంగతి తేలింది. ఇదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మొత్తం రెమ్యూనరేషన్ రూపంలో రూ.12.19 కోట్లు పొందారు.

2017-18లో పొందిన దాంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. వీరిద్దరి మధ్య వేతనం అంతరం ఇంచుమించు రెండు రెట్ల స్థాయిలో ఉన్నది. బుట్చెక్ పనితీరు ఆధారంగా ఇచ్చే బోనస్, ఇతర రాయితీలు కలుపుకొని రూ.9.23 కోట్లు చెల్లించిన టాటా మోటార్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద మరో రూ.32,02,494లు చెల్లించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పనితీరు ఆధారంగా ఇచ్చే బోనస్ 5.94 లక్షల  యూరోలు (ప్రస్తుత రేటు ప్రకారం ఇది రూ.77.67 కోట్లు) చెల్లించడానికి సంస్థ అధికారిక ఒప్పందం కుదుర్చుకున్నది. 

దీర్ఘకాలిక రాయితీల కింద మరో 5.94 లక్షల యూరోలు కూడా చెల్లించబోతున్నది. గతేడాదికిగాను టాటా మోటర్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రూ.6 లక్షలు చెల్లించింది. 

మరోవైపు మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా జీతం 7.97 శాతం పెరిగి రూ. 8.67 కోట్లు పొందారు. టాటా మోటర్స్ గతేడాదిలో 12,74,072 యూనిట్ల వాహనాల ను విక్రయించింది. వీటిలో కమర్షియల్ వాహనాలు 5,27,286 యూనిట్లు కాగా, ప్యాసింజర్ వాహనాలు 7,46,786 యూనిట్లు ఉన్నాయి. 

ఇదే సంవత్సరంలో మహీంద్రా అమ్మకాలు 10.76 శాతం పెరిగి 6,07, 548లకు చేరాయి. కంపెనీ ట్రాక్టర్ల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 3.4 శాతం పెరిగి 3,30,436లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాటా ప్యాసింజర్ వాహన విక్రయాలు 42,034ల కు చేరుకోగా, ఇదే సమయంలో మహీంద్రా 59,400లకు చేరాయి.

ఇక అదే సమయంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకే వార్షిక వేతనం రూ.12.19కోట్లుగా ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే, గోయెంకా వేతనం కేవలం 0.16శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది.