ఇది రాయితీల వేళ: ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’లో టాటా మోటార్స్ ఇలా
తమ వద్ద ఉన్న స్టాక్ విక్రయానికి మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్ మాదిరిగా టాటా మోటార్స్ ఏకంగా రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందజేస్తోంది.
అమ్మకాలు పడిపోయి ఆటోమొబైల్ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ వద్ద ఉన్న స్టాక్ విక్రయానికి ప్రయత్నాలను వేగవంతంచేశాయి. ఇప్పటివరకు మారుతీ సుజుకీ, మహీంద్రా, హ్యుండాయ్ ఎంపిక చేసిన మోడళ్లపై భారీగా రాయితీలు ప్రకటించింది.
తాజాగా ఇదే జాబితాలోకి టాటా మోటర్స్ చేరింది. టాటా మోటార్స్ ఏకంగా ఏడు మోడళ్ల కార్లపై రూ.1.50 లక్షల వరకు రాయితీలు కల్పిస్తున్నది. వచ్చేది పండుగ సీజన్ కావడం, పెరిగిపోతున్న స్టాకులను వదిలించుకోవడంలో భాగంగా వాహన సంస్థలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.
ఫెస్టివెల్ ఆఫ్ కార్స్ పేరుతో టాటా మోటర్స్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ వద్ద ఉన్న పాత కారును తీసుకొచ్చి కొత్త కారును ఎక్సేంజ్ చేసుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది.
కార్పొరేట్లకు, ప్రభుత్వరంగ ఉద్యోగులకు ప్రత్యేక స్కీంలను కూడా ప్రకటించింది సంస్థ. ఇందుకోసం సంస్థ పలు బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలతో జత కట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా 100 శాతం ఆర్థిక సహాయం, తక్కువ స్థాయి నెలవారీ చెల్లింపులు, ఇతర బెనిఫిట్లను కల్పిస్తున్నది.