బుల్లి సెడాన్లంటే మనోళ్లకు మోజు మరి!!
గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌యూవీ మోడల్ కార్లతో పోలిస్తే బుల్లి సెడాన్ కార్ల పట్ల మక్కువ పెరిగింది. ఎస్ యూవీలు, క్రాస్ ఓవర్ మోడల్ కార్లతో పోలిస్తే సబ్ -4 మీటర్ సెడాన్ కార్ల సేల్స్ 12 శాతం పెరగడమే దీనికి నిదర్శనం.
ముంబై: ఒకప్పుడు ఆటోమొబైల్ రంగంలో సబ్ -4 మీటర్ల సెడాన్ కార్లంటే ఎంతో బూమ్ ఏర్పడింది. మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ ప్రయాణికుల కార్ల మార్కెట్లో సబ్ సెగ్మెంట్ సెడాన్ కార్ల విక్రయాలు శరవేగంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
అందువల్లే ఇండియన్ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ నెమ్మదించడానికి కారణమని తెలుస్తోంది. బుల్లి సెడాన్ కార్లలో మారుతి సుజుకి డిజైర్, నూతన తరం హోండా అమెజ్ మోడల్ కార్లకు మిక్కిలి డిమాండ్ ఏర్పడింది. నావెల్టీ మోడల్‌లో డిజైన్ చేయడం వల్లే బుల్లి సెడాన్ కార్లపై ప్రజలు మక్కువ పెంచుకుంటున్నారు.
క్రాస్ ఓవర్, ఎస్‌యూవీ మోడల్ కార్ల సేల్స్ 11 శాతం పెరిగితే 2018-19లో బుల్లి సెడాన్ కార్ల సేల్స్ 12 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో క్రాస్ ఓవర్, ఎస్‌యూవీ మోడల్ కార్లు 3.57 లక్షల యూనిట్లు అమ్ముడు పోతే బుల్లి సెడాన్ కార్లు 4.6 లక్షలు విక్రయించారు.
హ్యుండాయ్ ఎక్స్ సెంట్, టాటా టిగోర్, ఫోర్డ్ అస్పైర్ తదితర కార్ల సేల్స్ తగ్గుముఖం పట్టాయి. బుల్లి సెడాన్ కార్ల సేల్స్‌లో మారుతి డిజైర్, హోండా అమెజ్ మోడల్ కార్ల విక్రయాలదే అగ్ర తాంబూలం.
సెడాన్ కార్లు కేవలం ప్యామిలీ కార్లుగా మాత్రమే కాక తదుపరి దశలో అప్ గ్రేడ్ చేసేందుకు వీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హోండా కార్స్ యాజమాన్యం తన ‘అమేజ్’ మోడల్ కారును మరింత అప్ గ్రేడ్ చేసి భారత మార్కెట్లోకి తీసుకు రావాలని తలపోస్తున్నది.
బోల్డ్ స్టయిలింగ్, ప్రీమియం ఆఫరింగ్‌తో రూపుదిద్దుకున్న అమేజ్ మోడల్ ద్వితీయ తరం కారును చిన్న నగరాల మార్కెట్లోకి తీసుకెళ్లాలని హోండా కారు యాజమాన్యం ఉవ్విళ్లూరుతోంది.
హోండా కార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజేశ్ గోయల్ మాట్లాడుతూ 70 శాతం అమేజ్ సేల్స్.. టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల్లోనే ఉన్నాయని తెలిపారు. వీరిలో 8 శాతానికి పైగా అమెజ్ బయ్యర్ తొలుత కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు కొనడానికే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.
షేర్డ్ మొబిలిటీకి బుల్లి సెడాన్ కార్లు కూడా ఫేవరెట్ అని ఎక్స్ పెరెల్ అనే కన్సల్టెన్సీ సంస్థ వ్యవస్థాపకుడు అవిక్ ఛటోపాధ్యాయ చెప్పారు. డిజైర్ కూడా టూర్’కు వెళ్లేందుకు మరింత చౌకగా ఉంటుంది. ఇక ఎక్స్ సెంట్ మోడల్ కారు క్యాబ్ హైలింగ్ సర్వీసుకు అనువుగా ఉంటుంది.