మహీంద్రా అండ్ మారుతి మినహా ఏడో ‘సారీ’ నీరసమే

ప్యాసింజర్ విక్రయ లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరంలో చేరే అవకాశాలు లేవని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తేల్చేసింది. మారుతి, మహీంద్రా సంస్థల్లో స్వల్ప మెరుపులు.. అక్టోబర్ తప్ప గత ఎనిమిది నెలల్లో ఏడు నెలల్లో వాహనాల విక్రయాలు నేలచూపులే చూస్తున్నాయి. 

Passenger vehicle sales down 1% in February

దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఫిబ్రవరిలోనూ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 1.11% తగ్గాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) పేర్కొంది. గత ఎనిమిది నెలల్లో ఏడు నెలలు దిగువముఖం పట్టాయి.

దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన అమ్మకాల లక్ష్యానికి చేరుకునే అవకాశాలు లేవని సియామ్ వర్గాలు స్పష్టం చేశాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు మహీంద్రా, మారుతి సుజుకి సంస్థల వాహనాలు మినహా ఇతర సంస్థల వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.

సార్వత్రిక ఎన్నికల ముందు అనిశ్చిత పరిస్థితులు, నిరాశావాదంగా మార్కెట్ సెంటిమెంట్, అధిక వడ్డీరేట్లు, బీమా కోసం అధికంగా చెల్లింపులు వంటి కారణాలు ప్రయాణ వాహనాల విక్రయాలపై అమ్మకాలపై ప్రభావం చూపాయని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు. 

గత నెలలో 2,72,284 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2018 ఇదే నెలలో 2,75,346 యూనిట్లతో పోలిస్తే ఒక్క శాతానికి పైగా తగ్గాయి. గతేడాది జూలై నుంచి కేవలం ఒకే ఒక నెల అక్టోబర్‌లో మాత్రమే అమ్మకాలు పెరిగాయి. 

ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య ప్రయాణ వాహనాల అమ్మకాలు 3.27 శాతం పెరిగి 30,85,640 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే కాలానికి 29,87,859గా ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో కార్ల కొనుగోళ్లను ప్రజలు వాయిదా వేసుకుంటున్నారని, సెంటిమెంట్ కూడా నిరాశావాదంగా ఉండటంతో ప్రస్తుత నెలలో కూడా నిరాశ తప్పదని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ చెప్పారు. 

ఇప్పటిదాకా వాహన విక్రయాల ఆధారంగా లెక్కిస్తే 2018-19లో కేవలం మూడు శాతం మాత్రం పెరిగే అవకాశం ఉందని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ అన్నారు. గతంలో 8-10 శాతం మధ్య ఉంటుందని అంచనావేసిన సంగతిని గుర్తుచేశారు.

ప్రయాణికుల వాహన విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా స్వల్ప ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 0.19 శాతం వృద్ధితో ఫిబ్రవరిలో 1,39,912 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా 3.13 శాతం క్షీణతతో 43,110 యూనిట్లను విక్రయించింది.

మహీంద్రా 16.86 శాతం వృద్ధిని కనబరిచింది. కార్ల అమ్మకాల విషయానికి వస్తే 4.33 శాతం తగ్గి 1,71,372కి పరిమి తం కాగా, ద్విచక్ర వాహన సేల్స్ కూడా 4.22 శాతం పతనం చెంది 16,15,071లకు తగ్గా యి. కమర్షియల్ వాహన విక్రయాలు మరింత జారుకున్నాయి. మొత్తం మీద గత నెలలో దేశవ్యాప్తంగా 20,34,768 వాహనాలు అమ్ముడయ్యాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios