న్యూఢిల్లీ: అమ్మకాలు పడిపోవడంతో ఆటో కంపెనీలు వరుసగా తమ వాహనాల కొనుగోలుపై పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా నిస్సాన్‌ మోటార్స్‌ ఇండియా తన కార్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. ఎక్స్చేంజ్‌ ఆఫర్‌  కూడా ఉంది. నిస్సాన్ సన్నీ మోడల్‌ కారు కొనుగోలుపై గరిష్టంగా రూ. 90 వేల వరకు ఆఫర్‌ ఉంది. 

నిస్సాన్ మైక్రా, మైక్రో యాక్టివా, సన్నీలపై వివిధ రకాల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ లభ్యం.  నిస్సాన్‌ కిక్స్‌ కొనుగోలుపై మాత్రం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ లేదు. నిస్సాన్ కస్టమర్లకు ఫైనాన్స్ సులభతరం చేయడానికి కిక్స్‌లో జీరో శాతం వడ్డీ ఎంపిక అందుబాటులో ఉంది. ఈ నెలాఖరు వరకు ఈ  తగ్గింపు ఆఫర్‌ చెల్లుబాటవుతుంది. ఈ ఆఫర్‌లు  ఆయా నగరం, వేరియంట్‌ను బట్టి మారే అవకాశం ఉంది. ఖచ్చితమైన వివరాల కోసం నిస్సాన్ డీలర్‌షిప్‌ను సంప్రదించాలని వినియోగదారులకు సంస్థ సూచించింది.

నిస్సాన్ సన్నీపై రూ .30,000 వరకు నగదు తగ్గింపుతోపాటు అదనంగా రూ.30వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది నిస్సాన్. దీంతోపాటు కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగులు,  వైద్యులకు రూ. 14వేల వరకు అదనపు డిస్కౌంట్లను కూడా ఇది అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లకు, వాస్తుశిల్పులకు రూ. 8,000 వరకు ప్రత్యేక తగ్గింపు ఉంది.

మైక్రో హ్యాచ్‌బ్యాక్ కారు కొనుగోలుపై రూ .25 వేల వరకు నగదు తగ్గింపు పొందవచ్చు. రూ.20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఇంకా  కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగులు రూ .10వేల వరకు అదనపు బెనిఫిట్లు పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సిఏలు,  వాస్తుశిల్పులకు రూ .5 వేల వరకు తగ్గింపు వర్తిస్తుంది.

మైక్రో యాక్టివాపై నిస్సాన్ రూ .15 వేల వరకు నగదు తగ్గింపుతో పాటు రూ .20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది‌. బ్యాంక్, కార్పొరేట్ ఉద్యోగులు, వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సిఏలు, వాస్తుశిల్పులకు ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. 

నిస్సాన్‌ కిక్స్‌ పెట్రోల్‌ వెర్షన్‌ కారు కోసం 7.99 శాతం వడ్డీరేటు, అయిదేళ్ల వారంటీ, రోడ్‌సైట్‌ అసిస్టెన్స్‌, రూ. 17వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లు ఉన్నాయి. అలాగే నిస్సాన్‌ కస్టమర్లకు  మూడేళ్లపాటు జీరో శాతం వడ్డీరేటుతో రుణం లభిస్తుంది.