మళ్లీ ఎస్‌యూవీ కార్లదే హవా: కొత్త మోడల్స్‌కే డిమాండ్‌

ఇండియన్ల డిమాండ్లు అభిరుచులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. నయా కంపెనీలు, అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్లతో ఎస్ యూవీ మోడల్ కార్లు రావడమే దీనికి కారణం.

New SUV launches boost passenger vehicles demand

భారత విపణిలో కార్ల కొనుగోలుదారుల అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. చిన్న కార్లు, అత్తెసరు ఫీచర్లతో వాహనదారులు సంతృప్తి చెందడం లేదు. ధర కాస్త ఎక్కువగా ఉన్నా, అత్యాధునిక టెక్నాలజీ, నూతన ఫీచర్లు, పెర్‌ఫార్మెన్స్‌ కల కార్లకు ప్రాధాన్యం పెరుగుతోంది.

ముఖ్యంగా ఇటీవలి కాలంలో మార్కెట్లోకి వచ్చిన స్పోర్ట్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ) పట్ల కార్ల కొనుగోలుదారులు బాగా ఆకర్షితులవుతున్నాయి. ఆయా వాహనాలకు వచ్చిన బుకింగ్సే ఇందుకు నిదర్శనం. మొత్తంగా గత కొన్ని నెలలుగా కార్ల మార్కెట్లో అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి.

ఈ తరుణంలో ఎస్‌యూవీ మోడల్ కార్లకు గిరాకీ పెరుగుతుండటం ఆటోమొబైల్ కంపెనీలకు కాసింత ఊరటనిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు కార్ల మార్కెట్లో 10 శాతం తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో ఎస్‌యూవీల అమ్మకాలు మాత్రం 1.8 శాతం మాత్రమే తగ్గాయి.

తాజాగా దేశీయ మార్కెట్లోకి కొత్తగా మోరిస్‌ గ్యారేజెస్‌ (ఎంజీ), కియా కంపెనీలు ప్రవేశించాయి. ఎంజీ ఇటీవలే తన హెక్టార్‌ను విడుదల చేసింది. దక్షిణ కొరియాకు చెందిన కియా తన సెల్టోస్‌ను ఆవిష్కరించింది. ఈ నెల 16వ తేదీన సెల్టోస్‌ బుకింగ్స్‌ను ప్రారంభించారు. తొలి రోజే 6,046 బుకింగ్స్‌ నమోదయ్యాయి. 

వచ్చేనెల 22వ తేదీన సెల్టోస్ మోడల్ కారును లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఎంజీ మోటార్‌ ఇండియా తన హెక్టార్‌ ఎస్‌యూవీ బుకింగ్స్‌ను నిలిపివేసింది. ఇప్పటికే 21 వేలకు పైగా బుకింగ్స్‌ వచ్చాయి. ఎక్కువ బుకింగ్స్‌ ఉండటం వల్ల సమయానికి డెలివరీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ఎంజీ మోటార్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ ఎస్‌యూవీలో ఉన్న ఫీచర్లు కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తున్నాయి. హెక్టార్‌ను ఇంటర్నెట్‌ కారుగా ఎంజీ అభివర్ణిస్తోంది. స్ల్పిట్‌ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, ఎల్‌ఈడీ ఫాగ్‌ లాంప్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లాంప్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

షార్క్‌ పిన్‌ యాంటీనా, ఫ్లోటింగ్‌ లైట్‌ టర్న్‌ ఇండికేటర్స్‌, 10.4 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్ర్కీన్‌ ఏవీఎన్‌ సిస్టమ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు ఆశించిన స్థాయికన్నా ఎక్కువగా ఆర్డర్లు వస్తుండటంతో కంపెనీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
 
ఇప్పటికే హ్యుండాయ్‌, టాటా, మహీంద్రా వివిధ రకాల కార్లను భారత మార్కెట్లో విక్రయిస్తున్నాయి. హ్యుండాయ్‌ కొత్తగా విడుదల చేసిన వెన్యూ, క్రెటా మోడళ్లు, టాటా హారియర్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, మరాజో, అల్టుర్స్ కార్లకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. 

హ్యుండాయ్‌ వెన్యూకు ఇప్పటికే 50 వేలకు పైగా బుకింగ్స్‌ వచ్చాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 300, మరాజో, అల్టూరస్ కారుకు మొత్తం 70 వేలకు పైగా కార్ల బుకింగ్స్‌ వచ్చాయని తెలుస్తోంది. హారియర్‌ బుకింగ్స్‌ కూడా ఇప్పటికే 21 వేలు దాటాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios