డిజైన్, పాపులారిటీ, ప్రియారిటీ... సెడాన్, కంపాక్ట్ కార్లపై డిస్కౌంట్ల వర్షం

టెక్నాలజీని అంది పుచ్చుకుని ఎప్పటికప్పుడు కొంగ్రొత్త ఫీచర్లతో మంచి మోడల్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. 

Massive Car Discounts in March 2019: Upto Rs 2 lakh off on these popular Maruti, Hyundai, Tata, Toyota cars

ప్రజాదరణ ఉంటే చాలు.. పండగల సీజన్‌ కాకున్నా.. ద్విచక్ర వాహనాలు, కార్ల కంపెనీల్లో బెస్ట్ వాహనాలపై డిస్కౌంట్లు ప్రకటిస్తే చాలు కస్టమర్లు, వాహన చోదకులు కొత్త మోడళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు.

దీనికి తోడు అధిక బీమా భారం, ఇంధన ధరల ఎఫెక్ట్.. ఆర్థిక అనిశ్చితి 2018లో కార్లు, ద్విచక్ర వాహనాల విక్రయాలు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ఆటోమొబైల్ సంస్థలు 2018లో తయారైన మోడళ్లపై పెద్ద మొత్తంలో రాయితీలు అందిస్తున్నాయు. 

వాహనాన్ని బట్టి గరిష్ఠంగా రూ.95 వేల నుంచి రూ. 2 లక్షల వరకు నగదు రాయితీలతోపాటు కార్పొరేట్‌ డిస్కౌంట్లు, ఉచితంగా బీమా, సున్నా శాతం వడ్డీపై రుణాలు వంటి ప్రోత్సాహకాలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

గత కొద్ది నెలల నుంచి మందకొడిగా సాగుతున్న వాహన విక్రయాలతో డీలర్ల వద్ద నిల్వలు పేరుకు పోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కొందరు డీలర్ల వద్ద ప్యాసింజర్‌ వాహనాల నిల్వలు నెల రోజుల స్థాయికి, టూ వీలర్ల విషయంలో రెండు నెలల స్థాయికి పేరుకుపోయాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏడీఏ) ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇన్వెంటరీని వదిలించుకునేందుకు కంపెనీలతోపాటు కొన్ని చోట్ల డీలర్లు సైతం తమ వంతుగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయని, మొత్తంగా చూస్తే రాయితీలతో వ్యాపారాన్ని నెట్టుకొస్తున్నామని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలంటున్నాయి.
 
వచ్చే ఆర్థిక సంవత్సరంపైనా ఆటో రంగానికి పెద్దగా ఆశలు లేనట్లే కన్పిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసేవరకు అమ్మకాలు పుంజుకునే అవకాశాలు ఏమాత్రం కన్పించడం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మున్ముందు బ్యాంకులు ఆటో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తే గనుక పరిస్థితి కాస్త కుదుటపడవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు.
 
అమ్మకాలు తగ్గడానికి.. కొనుగోలుదారుల సెంటిమెంట్‌ బలహీన పడడంతోపాటు 
గత ఏడాది వరదలతో కేరళ అతలాకుతలమైంది. దీనికి తోడు వాహన బీమా వ్యయం అనూహ్యంగా పెరిగింది. గరిష్ఠ స్థాయికి ఇంధన ధరలు, వడ్డీ రేట్లు చేరుకున్నాయి. 

ఎన్బీఎఫ్సీ రంగంలో ద్రవ్య కొరత కారణంగా రుణాలు తగ్గిన వైనంతోపాటు ఏడాది ప్రారంభంలో అన్ని వాహనాల తయారీ సంస్థలు తమ వాహనాల ధరలు తయారీ ధరకు అనుగుణంగా పెంచేశాయి.

దీనికి తోడు కొత్తగా విపణిలోకి ఆయా సంస్థలు విడుదల చేసిన వాహనాలు అంతగా ఆకట్టుకోకపోవడం కూడా వాహనాల విక్రయాలు పడిపోవడానికి కారణాలు అని తెలుస్తున్నది. గడిచిన 8 నెలల్లో 7 నెలలు అమ్మకాలు క్షీణించాయి.

ఫిబ్రవరిలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 1.11 శాతం తగ్గి 2,80,125 యూనిట్లకు పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 11 నెలల (2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఫిబ్రవరి) కాలానికి సైతం ప్యాసింజర్‌ వాహన విక్రయాల వృద్ధి 3.27 శాతంగా నమోదైంది. 

ఈ 11 నెలల్లో 30,85,640 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. మార్చిలోనూ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, దీన్ని బట్టి 2018-19 ఆర్థిక సంవత్సర విక్రయాల వృద్ధి నాలుగేళ్ల నాటి కనిష్ఠ స్థాయి మూడు శాతానికి పరిమితం కావచ్చని ఇండస్ట్రీ అంచనా. చివరిగా 2014-15లో వాహన అమ్మకాల వృద్ధి 3.9 శాతంగా నమోదైంది.
 
సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ స్పందిస్తూ ‘ప్రస్తుతం ఆటో ఇండస్ట్రీలో కొనుగోలుదారుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉంది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజలు కార్లు, ఇతర వాహనాల కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు.

కాబట్టి మార్చిలోనూ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ విక్రయాల వృద్ధి 3 శాతం వద్ద పరిమితం కావచ్చు’ అని తెలిపారు. 
 
మారుతి సుజుకీ ఇండియా ఎండీ కెనిచి అయుకవ మాట్లాడుతూ ‘ఈ ఏడాది కంపెనీ విక్రయాల వార్షిక వృద్ధి 5 శాతంలోపే ఉండనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఎన్నికలు ముగిసేవరకు వాహన అమ్మకాలు మందకొడిగానే సాగే అవకాశం ఉంది’ అని అన్నారు. 

ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న నిల్వల విక్రయానికి మారుతి సుంచి టాటా వరకు ఆటోమొబైల్ సంస్థలన్నీ భారీగా ఆఫర్లు ప్రకటించాయి. మారుతి సుజుకి ఆల్టో 800 కారు ధరపై రూ.1.13 లక్షల నుంచి డిజైర్ రూ.1.95 లక్షల వరకు క్యాష్ బ్యాక్ మొదలు ఎక్స్జేంజ్ ఆఫర్లు అందిస్తోంది. 

దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ ‘గ్రాండ్ ఐ 10’పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కలిపి రూ.60 వేల ఆఫర్ ప్లస్ ప్రభుత్వోద్యోగులైతే మరో రూ5,100 ఆఫర్ లభిస్తోంది. ఇక ఎక్సెంట్ మోడల్ ధరపై రూ.90 వేల రాయితీ పలుకుతోంది. 

జర్మనీ మేజర్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఎంపిక చేసిన మోడళ్లపై లక్ష రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల చివరి వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్‌ను బ్రియో, అమేజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ, బీఆర్-వీ మోడళ్లకు మాత్రమే వర్తించనున్నదని పేర్కొంది. 2018 మోడల్ బ్రియోపై రూ.19 వేల వరకు రాయితీ ఇస్తున్నది. 

నూతన జనరేషన్‌గా విడుదల చేసిన అమేజ్‌పై వ్యారెంటీని హోండా కార్స్ ఐదేండ్ల వరకు పెంచింది. దీంతోపాటు జాజ్‌పై రూ.25 వేల వరకు ఎక్సేంజ్ బోనస్, రూ.25 వేల బీమాకోసం రూపాయి చెల్లిస్తే సరిపోతున్నది.

సిటీ సెడాన్‌పై రూ.32 వేల బీమా, ఎక్సేంజ్ బోనస్‌ను రూ.30 వేల వరకు, రూ.10 వేల విలువైన యాక్సెస్‌సిరీస్‌లను ఉచితంగా అందిస్తున్నది. అలాగే డబ్ల్యూఆర్-వీపై రూ.25 వేల బీమా, రూ.17 వేల ఎక్సేంజ్ బోనస్ కల్పిస్తున్నది.

దేశీయ ఆటోమొబైల్ మహీంద్రా వారి కేయూవీ 100 మోడల్ కారు కొంటే రూ.70 వేల క్యాష్ రాయితీ, రూ.30 వేల ఎక్స్చేంజ్ బోనస్ ప్లస్ కార్పొరేట్ బోనస్ రూ.4000 రాయితీనిస్తున్నది. మహీంద్రాకు పేరు తెచ్చిన మర్రాజోపై రూ.20 వేల ఎక్చ్సేంజ్ బోనస్ మాత్రమే లభిస్తున్నది. 

టయోటా యారిస్ కారు కొంటే రూ.1.45 లక్ష క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, అదనపు బెనిఫిట్ రూ.30 వేలు కల్పిస్తోంది. ఫోర్డ్ ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకో స్పోర్ట్ మోడల్ కార్లపై రూ.45 వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇక టాటా టియోగో మోడల్ కారుపై రూ.60 వేలు, హెక్సా మోడల్ కారుపై రూ.1.05 లక్షల రాయితీ అందుబాటులో ఉంది. 

నిస్సాన్ మిక్రా సీవీటీపై రూ. లక్ష, సన్నీ సీవీటీపై రూ.1.28 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది. వోక్స్ వ్యాగన్ మోడల్ పోలో కారుపై రూ.1.35 లక్షలు కనిష్ఠంగా, వెంటో కారుపై రూ.2.25 లక్షల డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.

రెనాల్డ్ లాడ్జీ కనిష్ఠంగా రూ.35 వేలతోపాటు కార్పొరేట్ రాయితీ రూ.5000 ప్లస్ ఏడాది బీమా ఉచితంగా కల్పిస్తోంది. రెనాల్ట్ క్యాప్చర్ ధరపై రూ.80 వేల డిస్కౌంట్ ప్రకటించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios