Asianet News TeluguAsianet News Telugu

మారుతి ‘బ్రేక్’లు: 2 రోజుల ఉత్పత్తి స్టాప్.. ముందంతా గడ్డు కాలమే.. సియామ్

అమ్మకాల్లేక మారుతి సుజుకి తన రెండు ప్లాంట్లలో రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మున్ముందు ఆటోమొబైల్ రంగానికి గడ్డు కాలమేనని సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు. విక్రయాలు తగ్గడంతో మున్ముందు మారుతి సుజుకిలో మరి కొంత మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Maruti To Shut Down Gurugram Manesar Manufacturing Plants
Author
New Delhi, First Published Sep 5, 2019, 11:25 AM IST

ఆటోమొబైల్ మార్కెట్‌లో నెలకొన్న తీవ్ర మందగమన పరిస్థితుల నేపథ్యంలో వాహనాల తయారీకి దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ విరామాన్నిచ్చింది.

హర్యానాలోని గురుగ్రామ్‌, మనేసర్‌ ప్లాంట్లలో రెండు రోజులు ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ నెల 7, 9 తేదీల్లో ఉత్పత్తి ఉండబోదని స్పష్టం చేసింది. మరోవైపు మున్ముందు ఆటోమొబైల్ రంగానికి అంతా గడ్డుకాలమేనని ‘సియామ్’ ఆందోళన వ్యక్తంచేసింది.

1.11 లక్షలకే మారుతి కార్ల ఉత్పత్తి పరిమితం
దీనికితోడు గత నెల ఆగస్టులో 33.99 శాతం ఉత్పత్తిని తగ్గించిన మారుతి.. నిరుడుతో పోల్చితే ఈసారి వాహనాల తయారీ లక్ష్యాన్ని 1,68,725 యూనిట్ల నుంచి 1,11,370 యూనిట్లకు కుదించివేసింది.

ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తి గత నెల 33.67 శాతం క్షీణించి 1,66,161 యూనిట్ల నుంచి 1,10,214 యూనిట్లకు తగ్గిపోయింది. ఇలా మారుతి సుజుకి ఉత్పత్తి తగ్గించడం వరుసగా ఇది ఏడో నెల కావడం గమనార్హం.

ఆగస్టులో 33 శాతం తగ్గిన మారుతి విక్రయాలు
జూలైలోనూ మారుతి ఉత్పత్తి 25.15 శాతం పడిపోయి 1,33,625 యూనిట్లకు పరిమితమైంది. ఆగస్టు అమ్మకాలు 33 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో 1,58,189 యూనిట్ల విక్రయాలు జరుగగా, ఈ ఏడాది ఆగస్టులో 1,06,413 యూనిట్ల అమ్మకాలే జరిగాయి. 

దేశ, విదేశీ ఆటోమొబైల్ సంస్థల విరామం
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను భారతీయ ఆటో పరిశ్రమ ఎదుర్కొంటుండగా, ఇప్పటికే దేశ, విదేశీ సంస్థలు ఉత్పత్తికి విరామం ప్రకటించిన సంగతి విదితమే. టాటా మోటర్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా తదితర సంస్థలు వర్క్‌ హాలిడేలను పాటిస్తున్నాయి.

బీఎస్ఈలో మారుతి స్టాక్ 3.56 శాతం పతనం
ఇదిలా ఉంటే బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో మారుతి సుజుకీ షేర్లు నష్టాలను చవిచూశాయి. గురుగ్రామ్‌, మనేసర్‌ ప్లాంట్లలో రెండు రోజుల ఉత్పత్తి విరామం ప్రకటన నేపథ్యంలో సంస్థ షేర్‌ విలువ దాదాపు 4 శాతం క్షీణించింది. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ)లో ఒకానొక దశలో 4.15 శాతం మేర పతనమైంది.

ఒక్కరోజే రూ.6644 కోట్ల సంపద హరి
చివరకు కోలుకుని బీఎస్ఈలో 3.64 శాతం నష్టాలపాలై రూ.5,829.75 వద్ద స్థిరపడింది. దీంతో ఈ ఒక్కరోజే సంస్థ మార్కెట్‌ విలువ రూ.6,644.88 కోట్లు హరించుకుపోయింది. ప్రస్తుతం మారుతి సుజుకీ మార్కెట్‌ విలువ రూ.1,76,105.12 కోట్లుగా ఉన్నది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లో సంస్థ షేర్‌ విలువ 4 శాతం దిగజారి రూ.5,805.20గా ఉన్నది.

ఇక ముందంతా గడ్డు కాలమే: సియామ్‌
ఆటో పరిశ్రమ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదని దేశీయ ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. అసలే అమ్మకాలు లేక దిగాలుపడిన ఆటో రంగానికి బీఎస్‌-6 ఉద్గార నిబంధనల పరివర్తన గుదిబండలా పరిణమించనున్నదని పేర్కొంది. 

వెహికల్స్ మోడ్రనైజేషన్ కోసం రూ.1000 కోట్లు
వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6కు వాహనాల టెక్నాలజీ మారాల్సి ఉన్నది. దీంతో మున్ముందు ఆటో కంపెనీలపై మరింత భారం పడనుందని సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా అన్నారు. ప్రతీ సంస్థ తమ వాహనాల ఆధునికీకరణకు రూ.1,000 కోట్ల మేర ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. 

ఆటో రంగం ముందుకు సాగడం కష్టమేనన్న రాజన్ వధేరా
మార్కెట్‌ మందగమనం నేపథ్యంలో వాహన తయారీదారులు, ఆటో కంపోనెంట్ల ఉత్పత్తిదారులు, డీలర్లు కష్టాల్లో పడ్డారని, ఇంత మొత్తంలో పెట్టుబడులకు ఆటో రంగం వేగంగా ముందుకు సాగక పోవచ్చని సియాం అధ్యక్షుడు రాజన్ వధేరా అభిప్రాయ పడ్డారు. వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయి ప్రమాదకర స్థితికి చేరిన నేపథ్యంలో బీఎస్‌-6 నిబంధనలను కేంద్రం త్వరగా అమల్లోకి తెస్తున్నది.

3000 మంది తాత్కాలిక ఉద్యోగుల తొలగింపులు
మార్కెట్‌ మందగమనం, అమ్మకాలు పతనమైన నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యలకు ఉపక్రమించిన మారుతి.. గత నెల దాదాపు 3000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది.

మారుతి సుజుకీలో గల 16,050 మంది శాశ్వత ఉద్యోగులను తొలగించే యోచనేదీ లేదని సంస్థ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ స్పష్టం చేశారు. అయినా పరిస్థితులు ఇలాగే ఉంటే మరికొంత మందికి ఉపాధి దూరం కావడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

27.3 శాతం తగ్గిన మారుతి నికర లాభం
ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో మారుతి సుజుకి నికర లాభం గతంతో పోల్చితే 27.3 శాతం పతనమై రూ.1,435.50 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో రూ.1,975.30 కోట్లుగా ఉన్నది. అమ్మకాల ఆదాయం గతంతో పోల్చితే రూ.21,810.70 కోట్ల నుంచి రూ.18, 735.20 కోట్లకు తగ్గింది.

కాగా, ఆటో పరిశ్రమకు ఉద్దీపనలు అవసరమని, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం తగ్గించాలని భార్గవ డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆటో కంపోనెంట్‌ పరిశ్రమలో 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios