మారుతికి మడత.. హ్యుండాయ్.. మహీంద్రా పైపైకి

ప్రయాణ వాహనాల విక్రయాల్లో మారుతి సుజుకికి తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో గతేడాదితో పోలిస్తే మారుతి సుజుకి కార్ల విక్రయాలు బాగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్ వాటా పెరగడం విశేషం.
 

Maruti Suzukis PV market share shrinks in Apr to Aug

ప్రయాణ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహన మార్కెట్లో మారుతి సుజుకీతోపాటు టాటా మోటార్స్ వాటా తరిగిపోయింది.

ఇదే సమయంలో హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా వాటా పెరిగినట్లు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) తాజా నివేదికలో పేర్కొన్నది. 
గత ఐదు నెలల్లో మారుతి సుజుకి కంపెనీ వాటా రెండు శాతం తగ్గి 50 శాతం దిగువకు పడిపోయింది.

క్రితం ఏడాది ఇదే సమయంలో 7,57,289 యూనిట్లను విక్రయించిన సంస్థ కార్ల విక్రయాలు ఈసారి 5,55,064లకు పడిపోయాయి. దీంతో గతేడాది 52.16 శాతంగా ఉన్న కంపెనీ వాటా ప్రస్తుతం ఇది 49.83 శాతానికి జారుకున్నది. మొత్తంమీద గత ఐదు నెలల్లో దేశీయంగా 11,09,930ల ప్యాసింజర్ కార్లు అమ్ముడయ్యాయి.

దీనిపై మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ స్పందిస్తూ కార్లు, వ్యాన్ల విభాగం ఆశాజనకంగా ఉన్నా, యుటిలిటీ వాహన విక్రయాలు భారీగా పడిపోయాయని చెప్పారు.

ముఖ్యంగా మార్కెట్లో అత్యధికంగా డిమాండ్ ఉన్న ఎర్టిగా కోసం వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉండటం కూడా అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణమన్నారు.

టాటా మోటర్స్ కేవలం 60,093 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో విక్రయించిన 98,702లతో పోలిస్తే భారీగా పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాటా 1.39 శాతం తగ్గి 5.41 శాతానికి పరిమితమైంది. 

మరోవైపు హ్యుండాయ్ మార్కెట్ వాటా 2.77 శాతం పెరిగింది. గత ఐదు నెలల్లో కంపెనీ 2,03,729ల వాహన విక్రయాలు జరిపింది. క్రితం ఏడాది ఇదే సమయంలో విక్రయించి 2,26,396లతో పోలిస్తే తగ్గుముఖం పట్టినా మార్కెట్ వాటా 15.59 శాతం నుంచి 18.36 శాతానికి పెరుగడం విశేషం. 

ప్రస్తుత సంవత్సరంలో సంస్థ దేశీయ మార్కెట్లోకి మూడు కొత్త వాహనాలను విడుదల చేయడం హ్యుండాయ్ సంస్థకు కలిసొచ్చింది. ఈ కొత్త వాహనాలకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించడం మార్కెట్ వాటా పెరుగడానికి దోహదపడినట్లు హ్యుండాయ్ మోటార్ జాతీయ విక్రయ హెడ్ వికాస్ జైన్ తెలిపారు.

ఇంకా మహీంద్రా అండ్ మహీంద్రా 89,733 యూనిట్లను విక్రయించింది. క్రితం ఏడాది అమ్మిన 1,00,015లతో పోలిస్తే తగ్గినప్పటికీ మార్కెట్ వాటా 1.19 శాతం ఎగబాకి 8.08 శాతానికి చేరుకున్నది. 

గతేడాది 67,051 యూనిట్ల వాహనాలను విక్రయించిన టయోటా కిర్లోస్కర్ మోటార్ కార్ల విక్రయాలు ఈసారికి 53,977లకు పడిపోయాయి. మార్కెట్ వాటా 4.62 శాతం నుంచి 4.86 శాతానికి పెరుగడం విశేషం.

రెనాల్ట్, స్కోడా, ఫోక్స్‌వ్యాగెన్‌ల మార్కెట్ వాటా స్పలంగా పెరిగింది. హోండా కార్స్ విక్రయాలు 79,599 నుంచి 51,569లకు పడిపోయాయి. మార్కెట్ వాటా కూడా 5.48 శాతం నుంచి 4.64 శాతానికి జారుకున్నది. ఫోర్డ్ ఇండియా మార్కెట్ షేర్ కూడా 2.81 శాతం నుంచి 2.70 శాతానికి పడిపోయింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios