ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఆవిష్కరిస్తున్న మైక్రో ఎస్ యూవీ మోడల్ కార్ల మధ్య పోటీ తీవ్రమైంది. ఫ్రాన్స్ ఆటోమొబైల్ మేజర్ రెనాల్డ్ సంస్థ క్విడ్ మోడల్‌లో నూతన కారును భారత విపణిలో విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. 

అక్టోబర్ ఒకటో తేదీన రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ భారత విపణిలో అడుగు పెట్టనున్నది. క్విడ్ క్లైంబర్ మోడల్ కారు రెనాల్డ్ ఆవిష్కరిస్తున్న కార్లలో అతి విశాలమైన కారుగా నిలిచింది. 

ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి భారత విపణిలోకి నూతన మోడల్ ఎస్-ప్రెస్సో కారును విడుదల చేసిన మరుసటి రోజే రెనాల్ట్ ‘క్విడ్ క్లైంబర్’ను మార్కెట్లోకి విడుదల చేయనున్నది. 

రెనాల్ట్ తన క్విడ్ క్లైంబర్ కారులో బయట కొన్ని స్వల్ప మార్పులు చేసింది. ఇక ఇంటీరియర్‌లో డార్క్ గ్రే రంగును వినియోగించింది. కారులో పెద్ద స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఇతర ఫీచర్లు అమర్చనున్నది. 

క్విడ్ క్లైంబర్ మోడల్ కారులో 799 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 54 బీహెచ్పీ శక్తిని, 72 ఎన్ఎం టార్చ్ విడుదల చేసింది. ప్రస్తుతం రెనాల్డ్ క్విడ్ కారు రూ.4.2 లక్షలకు లభించనున్నదని భావిస్తున్నారు. 

క్విడ్ క్లైంబర్ ఎఎంటీ కారు 1.0 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.4.7 లక్షలుగా నిర్ణయించారు. ఇటు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, అటు రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ మోడల్ ఫీచర్లు సరిపోలి ఉన్నాయి. 

ఇటు మారుతి ఎస్-ప్రెస్సో, అటు రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ మోడల్ కార్లు రెండింటిలోనూ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫ్రంట్ సీట్లకు పవర్ విండోస్, డిజిటల్ స్పీడో మీటర్స్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.