Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి బీఎస్-6 మారుతి ‘ఈకో’.. రూ.4.64 లక్షల నుంచి షురూ

పర్యావరణ హితమైన వాహనాలను విపణిలోకి విడుదల చేయడంలో మారుతి సుజుకి ముందు వరుసలో నిలుస్తోంది. ‘మిషన్ గ్రీన్ మిలియన్’లో భాగంగా ఎన్-సీఎన్జీ టెక్నాలజీతో పని చేసే ఈకో వ్యాన్‌ను మారుతి విడుదల చేసింది. 
 

Maruti Suzuki Eeco BS6 CNG launched in India; prices start at Rs 4.64 lakhs
Author
Hyderabad, First Published Mar 18, 2020, 12:53 PM IST

ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ‘మిషన్ గ్రీన్ మిలియన్’ ప్రాజెక్టులో భాగంగా ఎన్-సీఎన్జీ వాహనం ’ఈకో’ వ్యాన్‌ను విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ ఈకో వెహికిల్ భారత మార్కెట్‌కు పరిచయమైన నాలుగో బీఎస్-6 వాహనం కావడం విశేషం. 

ఎన్-సీఎన్జీ టెక్నాలజీతో పని చేసే ఈకో వ్యాన్
ఎన్-సీఎన్జీ టెక్నాలజీ సాయంతో పని చేసే ఈ వ్యాన్‌ను ఇప్పటికే 2020 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది మారుతి సుజుకి. దీని ప్రారంభ ధర రూ.4.64 లక్షలుగా మారుతి సుజుకి నిర్ణయించింది. 2010లో తొలిసారి మార్కెట్లోకి మారుతి సుజుకి ఈ ఈకో వ్యాన్ విడుదల చేసినప్పుడు 6.7 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 

10 లక్షలకు పైగా పర్యావరణ హిత వాహనాల విక్రయం
‘మిషన్ గ్రీన్ మిలియన్ ప్రాజెక్టు’లో భాగంగా మారుతి సుజుకి ఇప్పటి వరకు సీఎన్జీ, స్మార్ట్ హైబ్రీడ్ వంటి పర్యావరణ హిత వాహనాలను దేశంలో 10 లక్షలకు పైగా విక్రయించింది. 12 వేరియంట్లలో ఈ ఈకో మోడల్ వ్యాన్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. 

5 సీటర్-7 సీటర్- అంబులెన్స్ మోడళ్లలో ఈకో
5 సీటర్, 7 సీటర్, అంబులెన్స్ మోడళ్లలో ఈకో వ్యాన్ వినియోగదారులకు లభించనున్నది. మనుషులతోపాటు సామగ్రి రవాణాకు ఉపయోగించుకోవచ్చునని మారుతి సుజుకి వెల్లడించింది. డ్రైవర్ భద్రత కోసం సీటు బెల్ట్ సదుపాయం కల్పించింది మారుతి సుజుకి. 

అధిక మైలేజీ.. తక్కువ నిర్వహణ ఖర్చు
ఈ ఈకో వ్యాన్ అత్యధిక వేగంతో వెళుతున్నప్పుడు అప్రమత్తం చేయడానికి అలారం వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. మారుతి సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ ఈకో వ్యాన్ అధిక మైలేజీని ఇవ్వడంతోపాటు దీని నిర్వహణకు చాలా తక్కువ ఖర్చవుతుందన్నారు. ఈకో వ్యాన్ భద్రతతో కూడిన మల్టీ పర్పస్ వెహికల్‌గానూ ఉపయోగపడుతుందన్నారు. 

మల్టీ పర్పస్ వెహికల్ గా ‘టయోటా’ ఇన్నోవా క్రిస్టా
వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తన పాపులర్‌ మల్టీ–పర్పస్‌ వెహికల్‌ (ఎంపీవీ) ‘ఇన్నోవా క్రిస్టా’లో లిమిటెడ్‌ ఎడిషన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదలచేసింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ వాహనం ధర రూ. 21.21 లక్షలుగా ప్రకటించింది. 

ఎంపీఎస్‌లో లీడర్‌గా ఇన్నోవా క్రిస్టా
2.4 లీటర్ల డీజిల్, 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వంటి ఫీచర్లతో లీడర్‌షిప్‌ ఎడిషన్‌ పేరిట టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని ప్రవేశపెట్టింది. టీకేఎం సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవీన్‌ సోనీ మాట్లాడుతూ.. ‘ఎంపీవీ సెగ్మెంట్‌లో ఇన్నోవా క్రిస్టా 50 శాతం వాటాను కలిగి ఉంది. ఇందుకు సంకేతంగా లీడర్‌షిప్‌ ఎడిషన్‌ను విడుదలచేశాం’ అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios