Asianet News TeluguAsianet News Telugu

అదనపు సేఫ్టీ ఫీచర్స్‌తో ఆల్టో కే10: కాస్త పెరిగిన ధర!

ఎప్పటికప్పుడు మార్కెట్లోకి అప్ డేట్ మోడల్ కార్లను వినియోగదారుల ముంగిట ఉంచడంలో ముందు ఉండే మారుతి.. తాజా అదనపు సేఫ్టీ ఫీచర్లతో ఆల్టో కే 10ను ఆవిష్కరించింది. అయితే సేఫ్టీ ఫీచర్లు పెరగడం వల్ల ధర రూ.23 వేల వరకు పెరుగుతుందని కూడా మారుతి సుజుకి తెలిపింది. 

Maruti Alto K10 to cost Rs 23,000 more after new safety feature in   car
Author
New Delhi, First Published Apr 12, 2019, 10:25 AM IST

కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ.. హ్యాచ్బ్యాక్ ఆల్టో కే10ను అప్గ్రేడ్ చేసి మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచి విడుదల చేసిన ఈ కారు ధర పాత మోడల్ కారుతో పోలిస్తే రూ.23 వేల వరకు అధికం. ఈ ధర ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో మాత్రమే ఉంటుంది. 

నూతన ఫీచర్లలో భాగంగా ఈ కారులో ఈబీడీ(ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) కలిగిన ఏబీఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్రైవర్ సైడ్ ఎయిర్బ్యాగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, సీడ్ అలర్ట్ సిస్టమ్, డ్రైవర్ సీటు, కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి భద్రతా వసతులు ఉన్నాయి. ఈ నూతన ఫీచర్ ఏర్పాటు చేయడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని మారుతి సుజుకి తెలిపింది. 

ఆయా మోడల్ కార్లను బట్టి ఢిల్లీ, ఎన్సీఆర్లో ఈ కారు రూ.3,65,843 నుంచి రూ.4,44,777ల మధ్య లభించనున్నది. దేశవ్యాప్తంగా రూ.3,75,843 నుంచి రూ. 4,54,777లుగా నిర్ణయించింది. పాత మోడల్ తో పోలిస్తే ఈ కొత్త మోడల్ రూ.15 వేల నుంచి రూ.23 వేల వరకు పెరుగనున్నది. ఈ ధరలు గురువారం నుంచి అమలులోకి వచ్చాయని ఆ వర్గాలు తెలిపాయి.

సైయంట్‌లో పూర్తయిన షేర్ల బై బ్యాక్

ఐటీ, ఇంజనీరింగ్‌ సేవ సంస్థ కంపెనీ సైయెంట్‌ లిమిటెడ్‌ ఇటీవల చేపట్టిన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీనికి రూ.200 కోట్లు కేటాయించారు. స్టాక్‌ ఎక్స్ఛేంజిల ద్వారా ఓపెన్‌ మార్కెట్‌ పద్ధతిలో షేర్లు బై బ్యాక్ చేయాలని ప్రతిపాదించారు. ఇందులో కంపెనీ  ప్రమోటర్లు పాల్గొనరాదని నిర్ణయించారు. రూ.5 విలువ కల ఒక్కో షేర్‌ను గరిష్ఠంగా రూ.700 ధర మించకుండా కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు.

99.99 శాతం షేర్లు బై బ్యాక్ చేసిన సైయంట్

దీని ప్రకారం ఫిబ్రవరి 12న బైబ్యాక్‌ ప్రారంభమైంది. దీనిపై ఇప్పటి వరకూ రూ.199.99 కోట్లు వెచ్చించారు. రూ.640.21 సగటు ధరకు 31,23,963 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేశారు. ఇది ప్రతిపాదిక బైబ్యాక్‌లో 99.99 శాతానికి సమానం. దీంతో బైబ్యాక్‌ ప్రక్రియను ముగించాలని కంపెనీ  యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 11వ తేదీతో బైబ్యాక్‌ పూర్తయినట్లు ప్రకటించింది. ప్రస్తుత బైబ్యాక్‌ చేపట్టటానికి ముందు సైయెంట్‌ లిమిటెడ్‌ జారీ మూలధనం 11,30,44,691 ఈక్విటీ షేర్లు కాగా ఇందులో ప్రమోటర్లకు 22.10 వాటా ఉంది. బైబ్యాక్‌ తర్వాత జారీ మూలధనం 10,99,20,728 షేర్లకు తగ్గి, ప్రమోటర్ల వాటా 22.73 శాతానికి పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios