ఇది హగ్ చేసుకోవాల్సిన టైం : ఆనంద్ మహీంద్రా ట్వీట్
ఇది హగ్ చేసుకోవాల్సిన టైం అంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరలైంది. ఇక కరోనాపై పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, ఇతర వలంటీర్లకు వాహనాల కొనుగోలుకు రాయితీపై రుణాలివ్వనుననట్లు మహీంద్రా గ్రూప్ వెల్లడించింది.
ముంబై: కరోనా వైరస్ కోరల్లో చిక్కి ప్రపంచమంతా ఇంకా అల్లాడుతున్నది. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు, ఊరటలు లభించినా, మనుషులంతా భౌతిక దూరాన్ని పాటిస్తూ.. కనీస సామాజిక సంబంధాలకు దూరంగా బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర మరోసారి ఆసక్తికర అంశాన్ని ట్వీట్ చేశారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఈ మహమ్మారి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పెద్ద వాళ్ల ఆలింగనాలకు, ఆప్యాయతకు చిన్నారులు, సన్నిహితులు స్పర్శకు పెద్దవాళ్లు నోచుకోలేకపోతున్నారు.
అయితే ఇలాంటి అనుభవాన్ని మిస్ కాకుండా కనిపెట్టిన ఒక విలక్షణమైన పరికరానికి సంబంధించిన ఒక వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ఈ పరికరాన్ని సృష్టించడానికి నోబెల్ బహుమతి విజేత కానవసరంలేదు.. కానీ ఆప్తుల ఆలింగనాన్ని కోల్పోయిన వృద్ధుల జీవితాలను ఈ ఆవిష్కరణ మార్చేసింది. మనం ఎంతో ఎదురు చూస్తున్న వైరస్ టీకా అంత ముఖ్యమైనది ఇది కూడా అని ఆయన ట్వీట్ చేశారు.
also read ఫేస్ మాస్క్ ధరిస్తేనే రైడింగ్ లేదంటే..: ఉబెర్ తాజా ప్రకటన
మరోవైపు దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తమ వాహన కొనుగోలుదార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీములను అందుబాటులోకి తెచ్చింది. కరోనా వారియర్లు, మహిళలు, వైద్యులు, పోలీసులకు ఎనిమిదేళ్ల వ్యవధి కల రుణ సదుపాయం, ఈఎంఐ చెల్లింపులపై 90 రోజుల మారటోరియం, 100 శాతం ఆన్‌రోడ్ ఫైనాన్సింగ్, ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రాయితీ లాంటి ఆఫర్లను అందజేయనున్నట్టు ప్రకటించింది.
మహిళా కొనుగోలుదారులకు రుణ మొత్తంలో 10 బేసిస్ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. బీఎస్-6 వాహనాలను కొనుగోలుచేసే కస్టమర్లు బీఎస్-4 వాహన ధరలకు సమానమైన ఈఎంఐలు చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది.
ఇప్పుడు ఎస్‌యూవీలను కొనుగోలుచేసే కస్టమర్లు తమ ఈఎంఐ చెల్లింపులను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించొచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా వివరించింది. మరో స్కీములో ప్రతి రూ.లక్ష వాహన రుణంపై ఈఎంఐ రూ.1,234 కంటే తక్కువగా ఉంటుందని పేర్కొన్నది.