ప్రముఖ దేశీయ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తన ఎస్‌యూవీ శ్రేణిలో సరికొత్త లోకాస్ట్‌ డబ్ల్యూ3 ఎంట్రీ లెవెల్‌ వేరియంట్‌ ‘మహీంద్రా ఎక్స్‌యూవీ500’ కారును విపణిలోకి ఆవిష్కరించింది. దీని ధర రూ. 12.23 లక్షలుగా ఉంది.

ఈ నూతన మోడల్‌ దేశంలోని అన్ని మహీంద్రా డీలర్ల వద్ద తక్షణమే లభిస్తుందని సంస్థ ప్రకటించింది. 2.2 లీటర్‌, ఫోర్‌ సిలిండర్‌, ఎం-హాక్‌ డిజిల్‌ ఇంజిన్‌ గల ఈ వేరియంట్‌ 155 బీహెచ్‌పీ శక్తిని, 360 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.

కారు ఫ్రంట్‌లో డ్యూయల్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ(ఏబీఎస్‌), ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్స్‌, ఇమ్మొబిలైజర్, నాలుగు చక్రాల డిస్క్‌ బ్రేక్స్‌తో ప్రత్యేకంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దారు.

‘ఎస్‌యూవీ శ్రేణిలో ఈ వేరియంట్‌ సరికొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుంది. అత్యాధునిక సాంకేతికత, సరికొత్త డిజైన్‌, హైటెక్‌ ఫీచర్స్‌, అబ్బురపరిచే పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకోవడంలో ముందు ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు’ అని మహీంద్రా అండ్‌ మహీంద్రా సెల్స్‌, మార్కెటింగ్‌, ఆటోమోటివ్‌ డివిజన్ అధ్యక్షుడు విజయ్‌ రాం నక్రా తెలిపారు.

ఇంతకుముందు విడుదల చేసిన డబ్ల్యూ5 వేరియంట్ కారు ధరతో పోలిస్తే న్యూ డబ్ల్యూ3 వేరయింట్ కారు రూ.56 వేల తక్కువకు లభిస్తుంది. అంటే డబ్ల్యూ5 వేరియంట్ కారు ధర రూ.12.80 లక్షలు. ఎక్స్ యూవీ 500 డబ్ల్యూ3 మోడల్ కారులోనూ ఎక్స్ యూవీ 500 డబ్ల్యూ 5 మోడల్ కారులో వినియోగించిన డిజైన్ వాడారు.