ప్రముఖ ఇటలీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘లంబోర్ఘినీ’ భారత విపణిలోకి ‘హరికేన్ ఈవో స్పైడర్’ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీన విపణిలోకి విడుదల చేస్తామని లంబోర్ఘినీ తెలిపింది. అదే సమయంలో లంబోర్ఘినీ ముంబై నగరంలో కొత్త షోరూమ్ ప్రారంభించింది. 

సాధారణ కూపే వర్షన్ కారుతో పోలిస్తే హరికేన్ ఈవో దాదాపు 120 కిలోల బరువు అధికంగా ఉంటుంది. ఈ కొత్త కారులో ఎలక్ట్రో హైడ్రాలిక్ రూఫ్ ఫోల్డింగ్ వ్యవస్థను అమర్చారు. 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో కేవలం 17 క్షణాల్లో కారు రూఫ్‌ను మడతబెట్టేస్తుంది. 

లంబోర్ఘిని కారు డిజైన్‌ను మరింత ఏరో డైనమిక్‌గా తీర్చిదిద్దింది. దీనికి రెండు డోర్లు ఉంటాయి. కారులో 8.4 అంగుళాల టచ్ స్క్రీన్ అమర్చారు. కారు ఫంక్షనింగ్, పనితీరు, ఆపిల్ కారు ప్లే, వాయిస్ కమాండ్స్, డ్యూయల్ కెమెరా టెలిమెట్రీ వ్యవస్థ, అత్యధిక సామర్థ్యం గల హార్డ్ డిస్క్ ఈ టచ్ స్క్రీన్‌లో అమర్చారు. 

ఇక ఈ కారు ఇంజిన్ విషయానికి వస్తే 5.2 లీటర్ల వీ 10 ఇంజిన్ పవర్ కూపే వర్షన్  ఏర్పాటు చేశారు. ఈ ఇంజిన్ 8000 ఆర్పీఎం వద్ద 631 బీహెచ్పీ శక్తి, 6500 ఆర్పీఎం వద్ద 600 ఎన్ఎం టార్చ్ విడుదల చేస్తుంది. ఈ కారు కేవలం 3.1 క్షణాల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు.