రివర్స్ ట్రెండ్: పండుగల సీజన్‌లో'కియా'జోష్.. 7554 బుకింగ్స్ నమోదు
దేశీయంగా ఆటోమొబైల్ సంస్థలన్నీ సేల్స్ లేక దిగాలు పడి ఉంటే దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటర్స్ ఇండియా సెప్టెంబర్ నెలలో అమ్మకాల్లో దుసుకెళ్లింది. ఎస్యూవీ-సెల్టోస్ మోడల్కు చెందిన 7,554 కార్ల విక్రయాలు జరిగినట్లు ప్రకటించింది. ఈ నెలలో మొత్తం 50 వేల బుకింగ్స్ నమోదయ్యాయని తెలిపింది.
న్యూఢిల్లీ: ఒక్కోసారి రివర్స్ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. దేశీయంగా ఆటోమొబైల్ సంస్థలు విక్రయాలు లేక ఆందోళనకు గురవుతున్నాయి. కానీ దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ మాత్రం రివర్స్ ట్రెండ్ నమోదు చేసింది.
సెప్టెంబర్ నెలలో కియా మోటర్స్ ఇండియా విక్రయాల జోరు సాగింది. ఎస్‌యూవీ- సెల్టోస్మోడల్‌కు చెందిన 7,554 కార్ల విక్రయాలు జరిగినట్లు ప్రకటించింది. ఇదే నెలలో 50 వేల యూనిట్లకు పైగా ముందస్తు బుకింగ్‌లు నమోదైనట్లు తెలిపింది.
ఈ ఏడాది ఆగస్టు 22న భారత విపణిలోకి ఎస్‌యూవీ-సెల్టోస్ మోడల్ కారును కియో విడుదల చేసింది. ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో మొత్తం 13,990 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది.హర్యానాలోని గురుగ్రామ్‌లో తన మొదటి బ్రాండ్ ఎక్స్పీరియన్స్ కేంద్రం 'బీట్-360'ని గురువారం ప్రారంభించింది సంస్థ.
భారతదేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు కియా మోటార్స్ తెలిపింది. సుమారు 5,280 చదరపు అడుగుల మేర ఉన్న ఈ కేంద్రం కియా ప్రయాణం, బ్రాండ్, ఉత్పత్తుల వంటి విషయాల్లో కస్టమర్లుకు అవగాహన కల్పించే విధంగా తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా కియా మోటార్స్ ఎండీ, సీఈఓ కూక్ హున్ షిమ్ మాట్లాడుతూ.. ‘కియా భవిష్యత్ వ్యూహాలను ఈ సెంటర్ వివరిస్తుంది. భారత్‌లో నూతన ప్రామాణాలను ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించనుంది. భారత్‌లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన దగ్గర నుంచి వినియోగదారులు మా సంస్థపైనే దృష్టి సారిస్తున్నారు’ అని చెప్పారు.
‘నిజమైన కియా అనుభవాన్ని అందించడానికి వీరితో అనుసంధానం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక ఈ సెంటర్ పేరులోని మొదటి పదం బీటింగ్ ఆఫ్ హార్డ్‌కు సంక్షిప్తం. సంస్థ వ్యాపార ప్రాంతాలు (జోన్స్)కు సంకేతంగా 3, ఇంద్రియాలను సూచిస్తూ 6, హద్దులు లేవని చెప్పేందుకు 0 ఎంపిక చేసి 360 అని నిర్ణయించాం. త్వరలో దేశంలోని మెట్రో నగరాల్లోనూ ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని కియా మోటార్స్ ఎండీ, సీఈఓ కూక్ హున్ షిమ్ అన్నారు.